శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా జరిగిన వివాదానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా జరిగిన వివాదానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాలకు చెందిన కొంతమంది సభ్యులు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పావుగంట వాయిదా అనంతరం సభ పునఃప్రారంభమైనప్పుడు ముందుగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు ఆవేశానికి లోనైనప్పుడో, పొరపాటునో కొన్ని వ్యాఖ్యలు చేస్తారని, ఆ తర్వాత దానికి వాళ్లు క్షమాపణలు చెప్పడం కూడా సర్వసాధారణమని ఆయన అన్నారు. ఇంతకుముందు సభలో ముఖ్యమంత్రులు, స్పీకర్లు, ప్రతిపక్ష నాయకులు కూడా పొరపాటుగా మాట్లాడితే క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని, సభలో ఎవరూ ఇగోలకు పోకూడదని ఆయన చెప్పారు. అన్పార్లమెంటరీ పదాలు మాట్లాడినవాళ్లు వాటిని స్వచ్ఛందంగా ఉపసంహరించుకుని, సభకు క్షమాపణ చెబితే హుందాగా ఉంటుందని అన్నారు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేసి, చర్చను సజావుగా సాగించాలని సూచించారు.
అనంతరం స్పీకర్ కోడెల మాట్లాడుతూ, ''నిన్న చర్చ సందర్భంగా సభ గౌరవం, మర్యాద, హుందాతనాలకు భంగం కలిగించేలా ఇరుపక్షాలకు చెందిన కొందరు సభ్యులు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాం. ఎవరైనా ఉపసంహరించుకుంటున్నామంటే చేయొచ్చు, లేకపోతే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది'' అని, ఆ తర్వాత ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు.