వాళ్లు19సార్లు అమర్యాదగా మాట్లాడారు
హైదరాబాద్ : అసెంబ్లీలో తమకు మాట్లాడే స్వేచ్ఛ లేనందునే సభ నుంచి వాకౌట్ చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్ జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలంతా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో స్పీకర్ వ్యవహార శైలిపై చూస్తుంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేనా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సభాపతా అనే అనుమానం వ్యక్తం అవుతుందన్నారు.
అసెంబ్లీలో శుక్రవారం అధికారపక్షం నేతలు 19సార్లు అన్పార్లమెంటరీ భాష ఉపయోగిస్తే ఏమీ అనని స్పీకర్, తాము ఒక్కసారి 'బఫూన్' అనే పదం ఉపయోగిస్తే దానికి అభ్యంతరం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. స్పీకర్ కోడెల కూడా తనను 'ఇర్రెస్పాన్సిబుల్' అన్నారని, అలా అనడం కూడా అన్ పార్లమెంటరీయేనన్న విషయం ఆయనకు తెలుసో లేదోనని చెప్పారు. సభలో తమ గొంతు వినిపించే అవకాశం లేనందునే బయటకు వచ్చి తమ తెలుపుతున్నామన్నారు.
గత మూడు నెలల్లో వైఎస్ఆర్ సీపీకి చెందిన 14మంది చనిపోయారని, వాటిపై విచారణ చేపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో చర్చ జరుపుతున్నారన్నారు. అవి తప్పుడు ఆరోపణలు అని చంద్రబాబుకు తెలుసు కాబట్టే ....జేసీ బ్రదర్స్కు టికెట్లు ఇచ్చారన్నారు. 14 మంది రాజకీయ హత్యలకు గురైతే కనీసం వాళ్ల గురించి ఒక్క మాట మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయన చెప్పారు.