వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేల ఆందోళన
హైదరాబాద్ : సభలో విపక్ష నేతలను మాట్లాడనీవ్వటం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగింది. అసెంబ్లీలో టీడీపీ వైఖరని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు నోటికి నల్ల రిబ్బను కట్టుకుని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రతిపక్షం నోటిని నొక్కేస్తున్నారంటూ అంతకు ముందు వైఎస్ఆర్ సీపీ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షానికి స్పీకర్ వంత పాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఆరోపించింది. దీనిపై నిరసన తెలుపుతూ నేటి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.
అంతకు ముందు సభలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని యథేచ్ఛగా రాష్ట్ర అసెంబ్లీలోనే ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతలపై చర్చ పునఃప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్లల్లా అసత్యాలు మాట్లాడుతూ, ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక శాసన సభ్యుడు తన ఇష్టంవచ్చినట్లు అబద్ధాలు చెబుతుంటే, ఆ అబద్ధాలు చెప్పుకోనివ్వండంటూ సమయం కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.