చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: కొత్త రాజధాని కేవలం అధికార కేంద్రంగానే కాకుండా ఆదాయం - అభివృద్ధికి అనువుగా ఉండటం - తెలుగుదనం ఉట్టిపడేవిధంగా - అందరికీ అందుబాటులో ఉండాలని శివరామ కృష్ణన్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిసింది. కొత్త రాజధాని ఎంపిక కోసం సూచనలు చేయడానికి అర్బన్ డెవలప్మెంట్ మాజీ కార్యదర్శి కెసి శివరామ కృష్ణన్ అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో ఏర్పడిన కమిటీ ఈ రోజు చంద్రబాబును కలిసింది. ఒక ప్రాథమిక నివేదికను ఆయనకు సమర్పించింది. ఈ కమిటీ ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు ప్రకాశం జిల్లాలో పర్యటించింది. రేపు రాయలసీమలో పర్యటించబోయే ఈ కమిటీ ఇప్పటి వరకు తాము పర్యటించిన ప్రాంతాల గురించి చంద్రబాబుతోపాటు ఉన్నతాధికారులకు ఈ కమిటీ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్తరాజధాని ఎంపిక విషయంలో కమిటీకి కొన్ని సూచనలు చేశారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా కొత్త రాజధాని నిర్మించడం మన బాధ్యత అని చెప్పారు.
కమిటీకి ఆయన చేసిన కొన్ని సూచనలు:
1. కొత్త రాజధాని నగరం అధికారానికి ప్రధాన కేంద్రంగా ఉండటంతోపాటు ఆదాయ మార్గాలు కూడా కలిగి ఉండాలి.
2. అభివృద్ధి చెందడానికి అనువుగా ఉండాలి.
3. రాష్ట్ర ప్రజలు అందరికి అందుబాటులో ఉండాలి.
4.నగరం తెలుగుదనం ఉట్టిపడేవిధంగా మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిభింభించేలా ఉండాలి.
5.నూతన భవన నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా తగిన మౌలిక సదుపాయాలు ఉండాలి.
6.తెలుగువారి బ్రాండ్ వాల్యూ ఉండాలి.
7. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించేదిగా ఉండాలి.
8.రాజధాని నగరంలో ఉండే జనానికి సరిపడ సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండాలి.
చంద్రబాబు నాయుడు సూచనలు, ఆయన చెప్పిన లక్షణాలు అన్ని ఒక్క విజయవాడ-గుంటూరు ప్రాంతానికే ఉన్నట్లు భావిస్తున్నారు. మొదటి నుంచి చంద్రబాబు కూడా ఈ ప్రాంతంపైనే దృష్టిపెట్టారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా ఈ రెండు నగరాల మధ్యన ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల ఖాళీ స్థలంలో చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి కూడా ఎక్కువ మంది రాజకీయ నేతలు, అధికారులు, ప్రజలు ఈ ప్రాంతాన్నే కొత్త రాజధానికి అనువైనదిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.