రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
Published Thu, Jan 30 2014 1:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
జిల్లాలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయాలపాలయ్యారు. భామిని మండలం సతివాడ వద్ద బైక్ అదుపు తప్పి భార్యాభర్తలు, కంచిలి మండలం అంపురం కూడలి వద్ద ఆటో ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. అలాగే సీతంపేటలో స్కూల్ బస్సు ఢీకొని అదే స్కూల్లో పనిచేస్తున్న విద్యార్థి, ఎచ్చెర్ల మండలం చిలకపాలెం టోల్‌ప్లాజా వద్ద లారీ ఢీకొని ఒకరు గాయపడ్డారు.
బైక్ అదుపు తప్పి భార్యాభర్తలకు...
కొత్తూరు, న్యూస్‌లైన్: భామిని మండలం సతివాడ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం చాకలిజయపురంనకు చెందిన భార్యాభర్తలు అంధవరపు వెంకటరావు, కళావతిలకు తీవ్రగాయాలు తగిలాయి. లోహరిజోల నుంచి కొత్తూరు వైపు వస్తుండగా ఒక్కసారి బైక్ ఆదుపు తప్పి పడిపోయింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు తగిలాయి. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యాధికారి పద్మావతి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యాధికారి తెలిపారు. ప్రమాదంపై వివరాలు సేకరించిన హెచ్‌సీ రామారావు కేసును బత్తిలి పోలీస్ స్టేషన్‌కు బదిలీచేసినట్లు తెలిపారు.
ఆటో ఢీకొని...
కంచిలి: మండలంలోని అంపురం కూడలి వద్ద జాతీయ రహదారి మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. హరిపురం నుంచి బరంపురం వైపు ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఇద్దర్ని మఠంసరియాపల్లి వైపు వెళుతున్న లగేజ్ ఆటో ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం మీద వెళుతున్న బరంపురానికి చెందిన మురళి, అజయ్ తీవ్రగాయాల పాలయ్యారు. వీరిని ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మురళి తలకు, శరీరమంతా బలమైన గాయాలై పరిస్థితి విషమంగా ఉంది. అజయ్‌కు కుడికాలు విరిగింది. ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం బరంపురం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థికి...
సీతంపేట: స్థానిక వివేకానందా విద్యావిహార్(బెస్ట్‌అవైల్‌బుల్ స్కూల్)లో మూడో తరగతి చదువుతున్న పాలక శ్రీనివాసరావు అదే పాఠశాలకు చెందిన స్కూల్ బస్ ప్రమాదవశాత్తు బుధవారం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. తరగతులు అయిన అనంతరం స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలోకి ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు మినీ స్టేడియం పనులు జరుగుతున్న చోట బోరు వేస్తుండడాన్ని చూడసాగాడు. ఒక్కసారిగా బోరునుంచి పైకి నీరు రావడంతో మిగతా విద్యార్థులతో కంగారు పడి పక్కకు పరిగెత్తాడు. అటుగా వస్తున్న స్కూల్ బస్‌ను గమనించ క పోవడంతో అది బలంగా ఢీకొట్టింది. కాళ్లకు తీవ్రగాయలవ్వడంతో వెంటనే స్థానిక 30 పడకల ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారి ఎం.రాంబాబు ప్రథమచికిత్స చేసి పాలకొండ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
లారీ ఢీకొట్టి వ్యక్తికి...
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెంలోని టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.సూర్య నారాయణ అనే వ్యక్తి గాయపడ్డారు. చికపాలెంలో అల్పాహారం తినేందుకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన సూర్యనారాయణను 108 వాహన సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. ఇక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. గాయపడ్డ వ్యక్తిది కుప్పిలి గ్రామం. రిమ్స్ ఔట్ పోస్టు పోలీసులు ఎచ్చెర్ల స్టేషన్‌కు వివరాలను అందజేశారు.
Advertisement
Advertisement