స్మగ్లింగ్‌కు అడ్డాగా నాయుడుపేట | smugglers land mark naidupeta | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్‌కు అడ్డాగా నాయుడుపేట

Published Sun, Jul 6 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

smugglers land mark naidupeta

నాయుడుపేట/ నాయుడుపేట టౌన్: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు నాయుడుపేట అడ్డాగా మారింది. కూడలి ప్రాంతమైన ఈ పట్టణాన్ని స్థానికులు కొందరు తమ అక్రమ వ్యాపారానికి స్థావరంగా చేసుకున్నారు. విజయవాడలో మూడురోజుల క్రితం ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న ఎర్రచందనం దుంగల ముక్కలను అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సులోని కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా నాయుడుపేటలో డొంక కదిలింది. వెంకటగిరి సమీపంలోని మోపూరు నుంచి విజయవాడకు దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో ఆ వ్యక్తులు వెల్లడించారు.
 
 నాయుడుపేటను కేంద్రంగా చేసుకుని దుంగలను ముక్కలు చేసి గోనెసంచుల్లో నింపి నిత్యం ఆర్టీసీ బస్సులు, లారీల్లో తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు విజయవాడ పోలీసులు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవాల్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి నాయుడుపేట సీఐ అక్కేశ్వరరావును అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన సీఐ పట్టణంలోని అగ్రహారపేటకు చెందిన సుధాకర్‌రెడ్డి, అశోక్ నగర్‌కు చెందిన అనిల్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
 
 విచారణలో చాకలికాలనీకి చెందిన రమేష్, చిట్టమూరు మండలానికి చెందిన శ్రీనివాసులు, పెళ్లకూరు మండలం ఎగువ చావాలికి చెందిన సుబ్బయ్య కూడా తమతో వ్యాపారం చేసే వారని వారు పోలీసులకు తెలిపారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న మరి కొందరి కోసం ఆరా తీస్తున్నారు.
 
 నిందితులను తప్పించేయత్నం
 ఐదుగురు స్మగ్లర్లను కేసుల నుంచి తప్పించే ప్రయత్నాలు మొదల య్యాయి. మూడు రోజులుగా జరుగుతున్న విచారణలో టీడీపీ నాయకుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతుం డడంతో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి పోలీసులను సంప్రదించారు. మాజీ ఎమ్మెల్యే పరసా రత్నం పంపారంటూ ఎస్సై ఆంజనేయరెడ్డితో మంతనాలు సాగించారు.
 
 ఎలాగైనా తమ పార్టీ వారిపై కేసులు నమోదు చేయకుండా పంపాలని, ఇది ఎమ్మెల్యే మాటగా చెప్పినట్లు తెలిసింది. మరోవైపు రాజకీయంగా, ప్రలోభాల రూపంలోనూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తారా..టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అసలు నిందితులను కేసు నుంచి తప్పిస్తారా అనేది పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
 
 గుట్టుగా రవాణా
 చెన్నై, విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు కూడలిగా ఉన్న నాయుడుపేటను స్మగ్లర్లు అడ్డాగా మార్చుకున్నారు. వెలుగొండ, శేషాచలం అడవుల్లో నరికిన దుంగలను గతంలో ఇక్కడ డంప్ చేసి చెన్నైకి తరలించేవారు. ఈ క్రమంలో పలుమార్లు భారీ ఎత్తున దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో స్మగ్లర్లు రూటు మార్చారు. దుంగలను ముక్కలుగా చేసి బస్తాల్లో పార్శిల్ చేసి విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement