సర్వదర్శనం క్యూలోకి పాము
భక్తులతో కిక్కిరిసిన సర్వదర్శనం క్యూలోకి ఆదివారం మధ్యాహ్నం ఓ పాము చొరబడింది. భక్తులు భయంతో కేకలు వే శారు. ఆ పాము ఇద్దరిని కాటు వేసి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లింది. సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠంలోని 31 షెడ్లలో నిండిపోవడంతో వెలుపల ఆళ్వారుచెరువు చుట్టూ క్యూ విస్తరించింది. ఇదే క్యూలోకి పక్కనే చెట్ల పొదల నుంచి హఠాత్తుగా ఓ పాము వచ్చింది. దీన్ని గుర్తించిన భక్తులు పాము..పాము..
అంటూ ఒకరిపై ఒకరు దూకుతూ కేకలు పెట్టారు. ఆ శబ్దానికి పాము బెదిరింది. కర్ణాటకలోని మాండ్యపట్టానికి చెందిన గౌరమ్మ (55), బళ్లారిలోని విజయపురానికి చెందిన భవాని (5) పాదంపై కాటేసి జారుకుంది. వెంటనే వారిని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. తర్వాత తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఏకంగా క్యూలోకి పాము వచ్చి కాటే సి కష్టాలపాలు చేయటంపై బాధితులు టీటీడీ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.