
బావ.. బావమరిది.. మావయ్య.. తోడల్లుడు
ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీలో బంధుగణం బాగానే కనిపిస్తోంది. ఒకరికొకరు బంధువులు కావడంతో ఎమ్మెల్యే గారూ, మంత్రిగారూ అని పిలుచుకోడానికి బదులు బావా, మావయ్యా, అన్నయ్యా అంటూ వరుసలతో పిలుచుకుంటూ ఆహ్లాదంగా కనిపిస్తున్నారు. చాలామంది బంధువులు ఈసారి వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి స్వయానా బావమరిది, వియ్యంకుడు కూడా అయిన నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గెలిచారు. దాంతో బావా బావమరుదుల వరస అక్కడి నుంచే మొదలైంది.
ఇక ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఇదే అసెంబ్లీలో ఉన్నారు. రవీంద్రనాథ్ రెడ్డికి వియ్యంకుడైన భూమా నాగిరెడ్డి, ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ఒకేసారి ఎన్నికై.. అంతా ఏపీ అసెంబ్లీలోనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూ, ఆయన తోడల్లుడు వరుపుల సుబ్బారావు.. ఇద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉన్నారు. వీళ్లిద్దరూ అన్నగారు, తమ్ముడుగారు అంటూ ఆహ్లాదంగా పలకరించుకుంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులవర్తి ఆంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి కిమిడి మృణాళిని ఎన్నిక కాగా, ఆమె బావ కిమిడి కళావెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి గెలిచారు. ఇలా సమస్త బంధుగణం ఏపీ అసెంబ్లీలో కొలువుదీరి కళకళలాడిస్తోంది.