దీపావళికి వస్తారనుకున్నాం....
రామచంద్రపురం, న్యూస్‌లైన్ :‘దీపావళికి ఇంటికి వస్తానమ్మా అని చెప్పిన కొడుకు, కోడలు ఇలా దూరమవుతారని అనుకోలే దు’ అంటూ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. పట్టణానికి చెందిన పలుకూరి నాగవెంకట రాజేష్(31), రమ్య(26)లతో పాటు వారి కుమార్తె రితిమ(3) బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు ప్రమాదంలో బుధవారం మరణించిన సంఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లో రమ్య మేనమామ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి వీరు వస్తుండగా మహబూబ్‌నగర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు.
పట్టణానికి చెందిన బచ్చు వీరభద్రరావు, రత్నావళిలకు రాజేష్ రెండో కుమారుడు. అయితే రాజేష్‌ను అమ్మమ్మ పలుకూరి మంగారాజు దత్తతకు తీసుకున్నారు. రాజేష్ స్థానిక పిల్లావారి మున్సిపల్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించగా కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కళాశాలలో ఇంటర్, వీఎస్‌ఎంలో డిగ్రీ, ఎంసీఏను చదివారు. అనంతరం ఉద్యోగం నిమిత్తం అమెరికాలో ఉన్నారు. కొన్నాళ్ల తరువాత బెంగళూరు సీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో జాయినయ్యారు. కాకినాడకు చెందిన రమ్యతో రాజేష్‌కు 2009 మేలో వివాహం జరిగింది. 2010 డిసెంబర్ రెండున వీరికి రితిమ జన్మించింది.
రైలు టికెట్ దొరకనందునే బస్‌లో..
రమ్య మేనమామ కూతురు వివాహానికి హాజరయి అనంతరం రామచంద్రపురం దీపావళికి వద్దామనుకున్నారు. అయితే ఇంతలోనే ఈ ప్రమాదం సంభవించింది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో రాజేష్ తల్లిదండ్రులు బెంగళూరులో జరిగిన రితిమ అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనట్టు చెబుతున్నారు. హైదరాబాద్ పెళ్లికి వచ్చేందుకు రైలు టికెట్ రిజర్వ్ కాలేదని భార్య, కుమార్తెతో కలిసి బస్సులో వస్తున్నట్టు తనకు రాజేష్ చెప్పాడని తల్లి రత్నావళి విలపించారు. పట్టణానికి చెందిన ఇద్దరు యువ ఇంజనీర్ల జంట బెంగళూరు బస్సు ప్రమాదంలో మృత్యువాత పడడంతో విషాదఛాయలు
అలుముకున్నాయి.