ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలోని ఓక్లహాం టర్నర్ జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన నూనె సురేష్‌బాబు (41) అమెరికాలోని డల్లాస్ రాష్ట్రంలో సింటెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం భార్య రూప, పిల్లలు గాయత్రీ అక్షయసంధ్య, సాయిమోహనీష్‌తో కలిసి ఓక్లహాం టర్నర్ జలపాతానికి హాలిడే ట్రిప్‌నకు వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. ‘రెండు నెలల్లో ఇంటికి వస్తానమ్మా అన్నాడు. కానరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. ఎదిగొచ్చిన కొడుకు చేతికి అందివచ్చాడనుకున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనను ఎలా జీర్ణించుకోవాలో అర్థం కావడం లేదంటూ’ సురేష్‌బాబు తల్లిదండ్రులు వీరాస్వామి, సుబ్బరత్నం కన్నీరు మున్నీరయ్యారు.
కుటుంబ నేపథ్యం ఇదీ..
ఒంగోలు మండలం కొప్పోలు గ్రామ నివాసి నూనె వీరాస్వామి. ఈయన భార్య సుబ్బరత్నం. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట రమేష్. చిన్న కుమారుడు నూనె సురేష్‌బాబు (41). ప్రస్తుతం ఒంగోలు నగరంలోని రంగుతోట 5వ లైనులో ఉంటున్నారు. సురేష్‌బాబుకు 15 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రూపతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పాప గాయత్రీ అక్షయ సంధ్య (13), బాబు సాయిమోహనీష్ (8). మూడేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం వీరు అమెరికా వెళ్లారు. ఏడాది క్రితం తల్లిదండ్రులను చూసేందుకు వచ్చాడు. ఇటీవలే మరో రెండు నెలల్లో వస్తానని చెప్పాడు. ఈ లోపుగానే విషాద ఘటన సమాచారం అందింది.
మృతదేహం తరలించేందుకు తెలుగు సంఘాల కృషి..
సురేష్‌బాబు మృతదేహాన్ని ఒంగోలుకు తరలించేందుకు కుటుంబ సభ్యులకు అండగా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు సంఘాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే సురేష్ మృతదేహాన్ని రెస్క్యూ టీం ఆస్పత్రికి తరలించింది. మృతదేహాన్ని డల్లాస్ నుంచి ఇండియాకు తరలించేందుకు 80 వేల డాలర్లు (రూ.53 లక్షలు) వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ఆ కుటుంబం భరించడం అసాధ్యం అని భావించిన తెలుగు సంఘాలు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్‌లో తమవంతు సాయాన్ని వారు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment