- మాలల సమావేశంలో సామాజిక విశ్లేషకులు గోపీనాథ్
హైదరాబాద్: రాజకీయ అధికారంతోనే మాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అందుకు సామాజిక, రాజకీయ శక్తులుగా మాలలు ఎదగాలని ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్ అన్నారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్‌లో మాలల ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన గోపీనాథ్ మాట్లాడుతూ.. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళితే వర్గం రాదేమో కానీ, కులం మాత్రం తప్పకుండా మన వెంటే వస్తుందన్నారు. భారత్‌లోని వామపక్ష పార్టీలు 90 ఏళ్ల తర్వాత కులం ప్రాధాన్యతను ఇప్పుడు గుర్తిస్తున్నాయని చెప్పారు.
మాజీ మంత్రి శంకర్రావు మాట్లాడుతూ.. దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ అనుకూల తీర్మానాన్ని ఈ సమావేశం వ్యతిరేకించింది. కార్యక్రమంలో మాల సంఘాల కన్వీనర్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, కాంగ్రెస్ నేత డాక్టర్ విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే లింగయ్య, ఎమ్మెల్సీ ప్రభాకర్, మాల సంఘాల నేతలు చెన్నయ్య, పసుల రామ్మూర్తి, రావుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.