డిమాండ్ల సాధనలో భాగంగా బసివిని, దేవదాసి, మాతంగి స్త్రీలు బుధవారం ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.
బసివినులు, దేవదాసీలకలెక్టరేట్ ముట్టడి విఫలం
అనంతపురం అర్బన్ : డిమాండ్ల సాధనలో భాగంగా బసివిని, దేవదాసి, మాతంగి స్త్రీలు బుధవారం ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. మూఢనమ్మకాల వల్ల తమ జీవితాలు బలయ్యాయని, మరోవైపు ప్రభుత్వ ఆదరణ కూడా తమకు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా ఇల్లు, 3 ఎకరాలు వ్యవసాయ భూమి, పెన్షన్, పిల్లలకు కార్పొరేషన్ కళాశాలలో ఉచిత విద్య, అంత్యోదయ కార్డులు ,బ్యాంకు లింకు లేకుండా రుణాలు, బస్సు, రైలు చార్జీల్లో రాయితీ కల్పించాలని, ఆరోగ్య బీమా వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చమలూరు రాజగోపాల్ మాట్లాడుతూ దేవదాసి, బసివిని, మంతగి అనే పేర్లతో మహిళలు వంచనకు గురవున్నారన్నారు. వీరి పిల్లలను పాఠశాలల్లో చేర్చడానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.
ఈ ఆచారం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కొనసాగుతోందన్నారు. ఈ ఆచారం రూపమాపడానికి 1948వ సంవత్సరంలో ప్రత్యేక చట్టం వచ్చినా ఇప్పటి వరకు అమలు కావడంలేదన్నారు. జిల్లాలో సుమారు 8 వేల మంది వరకు ఇ లాంటి మహిళలు ఉన్నారని, వీరందరి కి ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. అంతకుముందు బాధిత మహిళలు స్థానిక టవర్‌క్లాక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అక్కడ ైబె ఠాయించి కలెక్టరేట్ ముట్టడి చేయాలని ప్రయత్నించారు. వన్ టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి వారికి నచ్చజెప్పి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వచ్చే దాకా కదలమని భీష్మించి కూర్చున్నారు. అనంతరం కొందరు మహిళలను కలెక్టరేట్‌లోకి అనుమతించారు. ఏజేసీ సయ్యద్ ఖాజామొహిద్దీన్ వారితో గంట సేపు వారితో చర్చించారు.
వారి డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మద్దలచెరువు మల్లి, జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప, నాయకులు విఆర్ చంద్రశేఖర్, ఎర్రిస్వామి, గంగన్న, చిక్కప్ప, రామకృష్ణ పాల్గొన్నారు.