తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్
పలాస: టెక్కలి డివిజన్‌లోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజక వర్గాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఆదివారం కాశీబుగ్గ వచ్చిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు జలాశయాలను అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు. ప్రజలకు తాగునీరు సరఫరా సక్రమంగా జరిగితే రోగాల కు దూరంగా ఉంటారన్నారు. సురక్షిత నీరు లభించకపోవడం వల్లే ఉద్దానం ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సిన జిల్లా అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని చెప్పారు. జిల్లాలో అధికారుల కొరత కూడా చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. 20 శాఖల్లో అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారులు ఏ కారణంగా దీర్ఘకాలిక సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారని ఆమె ప్రశ్నించారు.
ఉచిత ఇసుక బూటకం
ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, అదంతా ఒట్టి బూటకమన్నారు. తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు వేల కోట్ల రూపాయల ఇసుకును తినేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక అక్రమ నిల్వలు ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఆమె ఆరోపించారు. శాసన సభలో ఒక మహిళా ఎమ్మెల్యే అని కనీసం గౌరవించకూండా ఆర్‌కే రోజాను శాసన సభలోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని, ఇది అప్రజాస్వామికమన్నారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జుత్తు జగన్నాయకులు, మాజీ ఎంపీపీ బత్తిన హేమేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ బోర కృష్ణారావు, రాపాక శేషగిరి, జుత్తు కూర్మారావు, జోగ కృష్ణారావు, గొలుసు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.