శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళాన్ని వ్యవసాయాధారిత జిల్లాగా గుర్తించిన ప్రభుత్వం, ఆఖరుకు జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అంతంత మాత్రంగానే చేసి చేతులు దులిపేసుకున్నారని ఆమె దుయ్యబట్టారు. జిల్లాలో సుమారు 4 లక్షల మందికి పైగా వరి పంట సాగుచేస్తున్న రైతులకు నిరాశే మిగిలిందన్నారు.
రైతులంతా సుమారు 2, 41, 155 మెట్రిక్ టన్నల ధాన్యాన్ని పండించారని, ఈ పంటను ఇంటిలో ఉంచుకోలేక, ప్రభుత్వానికి అమ్ముకోలేక దళారులను ఆశ్రయించే పరిస్థితులు తెచ్చారని విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై డాంబికాలు పలికిన నేతలు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో ఉదా సీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మరో మారు రైతుద్రోహిగా పేరుపొందారని, టీడీపీ నాయకులకు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయని రెడ్డి శాంతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment