‘పెద్దలు’ పత్రాలిస్తే జగన్‌పై కేసు వేశా: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంపై తనకు కొందరు పెద్ద మనుషులు సమాచారమిస్తే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశానని మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్‌రావు వెల్లడించారు. జగన్ కేసులో ఆధారాల్లేవని సీబీఐ చెప్పిన విషయాలన్నీ నిజమేనన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
జగన్ ఆస్తులపై శంకర్రావు వేసిన కేసుకు సంబంధించి 8 కంపెనీల్లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఆధారాల్లేవని సీబీఐ పేర్కొన్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, ‘‘బాబూ...! అది నేను సొంతంగా వేసిన కేసు కాదు. నీలాంటి పెద్ద మనుషులు కొందరు నా దృష్టికి సమాచారం తీసుకొస్తే కోర్టుకు లేఖ రాశాను. సీబీఐ అనేది స్వతంత్ర సంస్థ. అది రాష్ట్రపతి, ప్రధానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. సీబీఐ చెప్పిన విషయాలన్నీ నిజమే’’ అని బదులిచ్చారు. జగన్ బెయిల్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పాత్ర ఉందన్న టీడీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.