P Shankar Rao
-
'సర్వ నాశనం చేసి... ఇంకా పార్టీలో ఉన్నారు'
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధోగతి పాలు చేస్తున్న నాయకులపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పి.శంకర్రావు గురువారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సోంత పార్టీ వారే సర్వనాశనం చేశారని ఆరోపించారు. వారు ఇంకా పార్టీ కీలక పదవుల్లోనే కొనసాగుతున్నారని చెప్పారు. అలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్పా పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. తనతోపాటు గతంలో మంత్రులుగా పని చేసిన వారిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పి.శంకర్రావు డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణల వల్లే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయిందని పి.శంకర్రావు విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ఎంఐఎంను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోగలరా?
హైదరాబాద్: ఎంఐఎం నేతల ఆస్తులు కాపాడేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్ మెంట్ మార్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ ఆరోపించారు. ఎంఐఎంను సంప్రదించకుండా మెట్రో రైలు ప్రాజెక్టు మార్పులపై నిర్ణయం తీసుకునే దమ్ము సీఎం కేసీఆర్ కు ఉందాని ప్రశ్నించారు. పాత అలైన్ మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్య, పింఛన్లు, రుణమాఫీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పి. శంకర్రావు కోరారు. రుణమాఫీపై ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని సూచించారు. పించన్లు అందక వృద్ధులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
మాజీ మంత్రి శంకర్ రావుపై కేసు నమోదు
హైదరాబాద్: భూ కబ్జా కేసులో మాజీ మంత్రి శంకర్ రావు, ఆయన సోదరుడు దయానంద్‌పై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మల్కాజ్గిరి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. శంకర్ రావు సోదరులు నకిలీ పత్రాలతో గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో కబ్జాకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. వారిపై నేరపూరిత కుట్ర, మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
గిదేందే శంకరన్న ....
అధిష్టానానికి వీర విధేయుడిగా పేరుగాంచిన శంకర్రావు అలియాస్ శంకరన్నకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చింది. తనతో పాటు తన కుమార్తె సుస్మితకు టికెట్టు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. టిఆర్ఎస్ నుండి వచ్చిన వివేక్, వినోద్లకు టికెట్టు ఇచ్చి, శంకర్రావును దూరం పెట్టి చెయ్యి మార్కు చూపించి షాక్ ఇచ్చింది. దాంతో ఆరుసార్లు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన తనకు టికెట్ నిరాకరించడంపై గుస్సాగా ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యచరణను రూపొందించుకోవటంలో బిజీగా ఉన్నారు. ఇక తమకు గిట్టనివాళ్లపై కేసులు పెట్టించటాని కాంగ్రెస్ అధిష్టానం శంకర్రావును ఆటలో అరటిపండుగా ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధిష్టానం అనుగ్రహంతో మంత్రి పదవి అలంకరించిన శంకర్రావు తననోటికి వచ్చినట్టు మాట్లాడ్డం, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించి అధిష్టానానికి తలనొప్పిగా మారటంతో ఆయన్ని పార్టీ పదవి నుంచి పీకేసి పక్కన కూర్చోపెట్టింది. దాంతో సోనియమ్మ భజన చేయటమే కాకుండా శంక్రరావు అవకాశం ఉన్నప్పుడల్లా తన విధేయతను చాటుకునేవారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆమెకు గుడి కూడా కట్టించేశారు. అంతేనా... సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సోనియా పేరు పెట్టాలంటూ శంకర్రావు ప్రతిపాదన కూడా తెచ్చారు. అయితే శంకరన్నని కాంగ్రెస్ అధిష్ఠానం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదోమో అనిపిస్తోంది. తనకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు మా అమ్మాయికైనా ఇవ్వండని శంకర్రావు వినయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రాజకీయాలలో అతి చేస్తే పరిణామాలు ఎలా వుంటాయన్నదానికి శంకర్రావు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. దాంతో గదేందే శంకరన్న సీన్ రివర్స్ అయ్యిందని చెవులు గుసగుసలాడుకుంటున్నారు. -
'కల్లు తాగిన కోతిలా పవన్ వ్యవహారం'
హైదరాబాద్: స్టార్హోటల్లో జనానికి సంబంధం లేనివాళ్ల మధ్య జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్‌ది ప్రజల పార్టీయే కాదని కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు ఆరోపించారు. మంగళవారం ఆయన సీఎల్పీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యవహారం కోతి కల్లు తాగి గెంతులేసినట్టు ఉందని, ఆయన ప్రసంగం సినిమా షూటింగ్‌లా ఉందని ఎద్దేవా చేశారు. చిరంజీవి వల్లే సినీ పరిశ్రమలో గుర్తింపు పొంది ఇప్పుడు ఆయన ఉన్న పార్టీనే దూషించడాన్ని ఖండిస్తున్నానన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
కిరణ్ కంటే నేనే బెటర్: శంకర్రావు
సికింద్రాబాద్: తెలంగాణవాసుల ఎన్నోయేళ్ల కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి గుడి నిర్మిస్తానని..ఇందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు విజ్ఞప్తి చేశారు. మారేడుపల్లి డివిజన్ పరిధిలో రెండెకరాల ప్రభుత్వభూమిని కేటాయిం చాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ త్వరలో లేఖ రాస్తానని ప్రకటించారు. గురువారం బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీల్డ్‌కవర్ సీఎం అని,ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు లేదని ఎద్దేవాచేశారు. అర్హత ప్రాతిపదికన చూస్తే కిరణ్ కంటే తనకే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అధిష్టానం దయవల్ల ముఖ్యమంత్రి అయిన కిరణ్..అదే అధిష్టానాన్ని తిట్టడం ఆయన మూర్ఖత్వమన్నారు. నెహ్రూ-ఇందిర కుటుంబం తమ జీవితాల్ని దేశానికి అంకితం చేశాయన్నారు. సోనియాను విమర్శించడం సీమాంధ్ర నేతలకు అలవాటుగా మారిందని, వారికి తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. -
సోనియాకు శంకర్రావు గుడి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందుకు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సికింద్రాబాద్‌లో గుడి నిర్మించనున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే పి.శంకర్రావు వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... సోనియా గుడి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ధరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ అధికారుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. సోనియ జన్మదినమైన డిసెంబర్ 9వ తేదీన ఆ గుడికి శంకుస్థాపన చేస్తామని వివరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కేంద్రం త్వరితగతిన అడుగులు వేస్తుంది. రాష్ట్ర విభజనతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని అటు సీమాంధ్రలో ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. అయిన సోనియాగాంధీ వాటిని పట్టించుకోకుండా తనదైన శైలీలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతో ఎమ్మెల్యే శంకర్రావు ఆనందంతో ఉబ్బితబ్బివవుతున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి గుడి నిర్మించాలని శంకర్రావు ఆకాంక్షించారు. -
సీఎంకు దినేష్‌రెడ్డి వత్తాసు: శంకర్రావు
హైదరాబాద్: సీఎం కిరణ్, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఇద్దరూ తోడు దొంగలేనని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు. సీఎం డైరెక్షన్ మేరకే దినేష్‌రెడ్డి వ్యవహరించారని ఆయన ఆరోపించారు. సీఎం, ఆయన సోదరుడు సంతోష్‌రెడ్డి చట్టవ్యతిరేక చర్యలకు దినేష్‌రెడ్డి వత్తాసు పలికారని అన్నారు. దినేష్‌రెడ్డి డీజీపీగా పదవీ విమరణ పొందిన వెంటనే సీఎం కిరణ్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్‌రెడ్డిని తప్పించడం ఖరారైపోయిందని అంతకుముందు శంకర్రావు అన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. హైకమాండ్ సీఎం ప్లగ్ పీకేయడం ఖాయమన్నారు. -
వారం రోజుల్లో కొత్త సీఎం : శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్‌రెడ్డిని తప్పించడం ఖరారైపోయిందని మాజీ మంత్రి పి.శంకర్రావు చెప్పారు. వారం రోజుల్లో రాష్ట్రానికి కొత్త సీఎం రాబోతున్నారని, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అధిష్టానాన్ని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘నీకు గౌరవం కూడా ఉందా? నీ ఊరికే వెళదాం. ప్రజలు నీకు గౌరవమిస్తారో? మాకు ఇస్తారో తేల్చుకుందాం. విభజన విషయంలో అంతా స్టేజీ షో నడిపిస్తున్నావ్? ఎవరిని ఎప్పుడు ఎట్లా సెట్ చేయాలో హైకమాండ్‌కు తెలుసు. ఐదు రోజుల్లో సీఎం ప్లగ్ పీకేయడం ఖాయం’’అని పేర్కొన్నారు. -
‘పెద్దలు’ పత్రాలిస్తే జగన్‌పై కేసు వేశా: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తుల వ్యవహారంపై తనకు కొందరు పెద్ద మనుషులు సమాచారమిస్తే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశానని మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు వెల్లడించారు. జగన్ కేసులో ఆధారాల్లేవని సీబీఐ చెప్పిన విషయాలన్నీ నిజమేనన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ ఆస్తులపై శంకర్రావు వేసిన కేసుకు సంబంధించి 8 కంపెనీల్లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఆధారాల్లేవని సీబీఐ పేర్కొన్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, ‘‘బాబూ...! అది నేను సొంతంగా వేసిన కేసు కాదు. నీలాంటి పెద్ద మనుషులు కొందరు నా దృష్టికి సమాచారం తీసుకొస్తే కోర్టుకు లేఖ రాశాను. సీబీఐ అనేది స్వతంత్ర సంస్థ. అది రాష్ట్రపతి, ప్రధానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. సీబీఐ చెప్పిన విషయాలన్నీ నిజమే’’ అని బదులిచ్చారు. జగన్ బెయిల్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం పాత్ర ఉందన్న టీడీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. -
వీహెచ్‌ను అడ్డుకోవడం దారుణం: శంకర్రావు
తెలంగాణ ప్రత్యేక బిల్లు కోసం అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పి.శంకర్రావు శనివారం హైదరాబాద్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో సమైక్యవాదులు చేస్తున్న ఉద్యమాన్ని వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారో తెలాలని ఆయన స్ఫష్టం చేశారు. అయితే తిరుమలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావును అడ్డుకోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తెలంగాణ నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని పి.శంకర్రావు ఈ సందర్భంగా సూచించారు. -
సోనియా నిర్ణయాన్ని ధిక్కరించొద్దు: శంకర్రావు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. అందర్నీ సంప్రదించాకే తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సోనియా నిర్ణయాన్ని ధిక్కరించడం మంచిదికాదన్నారు. తెలంగాణపై చిరంజీవి, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రనేతలు అడ్డుపడొద్దని శంకర్రావు కోరారు.