అసెంబ్లీలో సోనియా డౌన్ డౌన్ నినాదాలు
హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యతిరేక నినాదాలతో రాష్ట్ర శాసనసభ దద్దరిల్లింది. సోనియా డౌన్ డౌన్ అంటూ అసెంబ్లీలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికే సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
దీంతో కాంగ్రెస్ సభ్యలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేనివారి గురించి మాట్లాడడం సరికాదని మంత్రులు కొండ్రు మురళి, శైలజానాథ్, జానారెడ్డి అన్నారు. సోనియాను నిందిచడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దోణ్రంరాజు శ్రీనివాస్ అన్నారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సోనియా డౌన్ డౌన్ అంటూ గట్టిగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది.