కుమారులూ.. తస్మాత్‌ జాగ్రత్త! | sons be careful parents allowance :SC | Sakshi
Sakshi News home page

కుమారులూ.. తస్మాత్‌ జాగ్రత్త!

Published Sun, Dec 17 2017 11:47 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

sons be careful parents allowance :SC - Sakshi

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోకుంటే ఇక కుదరదు. జీవించి ఉన్నంత కాలం వారి యోగక్షేమాలు చూడాల్సిందే. ఈ మేరకు భారత ప్రభుత్వం సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం–2007 అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని ముగ్గురికి కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున శనివారం తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా వ్యవహరించే కుమారులను చట్టప్రకారం శిక్షిస్తామనీ స్పష్టం చేశారు.

కందుకూరు: పట్టణానికి చెందిన సయ్యద్‌ నవాజ్‌ ఖయ్యూంకు ముజీబ్‌బాషా, ఖాదర్‌బాషా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిని తండ్రి పెంచి పెద్ద చేసి వివాహాలు చేశాడు. ప్రస్తుతం నవాజ్‌ఖయ్యూం వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. కొడుకులిద్దరూ తండ్రి ఆస్తులైదే పంచుకున్నారుగానీ ఆయన బాగోగులు గాలికొదిలేశారు. ముజీబ్‌బాషా నెల్లూరులో నివాసం ఉంటుండగా ఖాదర్‌బాషా సింగరాయకొండలో కాపురం పెట్టుకున్డాఉ. పోషణ భారమైన నవాజ్‌ఖయ్యూం తన కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఇటీవల ఆర్డీఓ మల్లిఖార్జునకు ఫిర్యాదు చేశారు. విచారించిన ఆర్డీఓ సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం–2007 ప్రకారం ఆయన కుమారులకు నోటీసులు జారీ చేశారు. 

అయినా వారు పట్టించుకోలేదు. తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ ఆ ఇద్దరు కుమారులను అరెస్టు చేయాలని తన కోర్టులో ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ఖాదర్‌బాషాను అరెస్టు చేసి ఆర్డీఓ కోర్టుకు తెచ్చారు. ముజీబ్‌బాషా కూడా ఆర్డీఓ వద్ద లొంగిపోయాడు. ఖయ్యూం కుమారులను ఆర్డీఓ తీవ్రంగా హెచ్చరించారు. తల్లిదండ్రులను చూడకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇద్దరితో చర్చించి తండ్రి పోషణార్థం ప్రతి నెలా చరో రూ.3500 చొప్పున తండ్రి ఖాతాలో జమ చేసేలా ఆర్డీఓ తీర్పు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. 

మరో కేసులో కుమారుడికి గుణపాఠం
ఇదే విధమైన మరో కేసులోను ఆర్డీఓ తీవ్రంగా స్పందించారు. లింగసముద్రం  మండలం మొగిలిచర్లకు చెందిన పోతినేని నర్సమ్మ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఒకే ఒక కొడుకు శివన్నారాయణ ఆమె పోషణను పట్టించుకోవడం లేదు. పైగా సర్వే నంబర్‌ 137/3లో ఉన్న 1.60 ఎకరాలు, సర్వే నంబర్‌ 144లో ఉన్న 1.44 ఎకరాల భూమిని తల్లికి తెలియకుండా తన పేరుపై మార్చుకున్నాడు. ఆ భూములకు పాస్‌ పుస్తకాలు తెచ్చుకుని అనుభవిస్తూ తల్లి పోషణను మాత్రం గాలికొదిలేశాడు. ఆమె కూడా ఆర్డీఓ మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్డీఓ విచారణ చేపట్టి చట్టంలోని నిబంధనల మేరకు శివన్నారాయణ పేరుపై ఉన్న పాస్‌ పుస్తకాలను రద్దు చేస్తూ శనివారం తీర్పు చెప్పారు. ఆ పొలాలను నర్సమ్మ పేరుపై మార్చుతున్నట్లు స్పష్టం చేశారు. సీనియర్‌ సిటిజన్స్‌ యాక్టు–2007 చట్టంలో తల్లిదండ్రులను పట్టించుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవచ్చని భారత ప్రభుత్వం పేర్కొందని ఆర్డీఓ పేర్కొన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులపై కఠిన చర్యలు తీసుకునే ఇటువంటి చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement