విభజన బిల్లుపై బీఏసీ భేటీలో స్పీకర్ మనోహర్ సభ్యులందరికీ నాలుగు పేజీల వివరణాత్మక నోట్ ఒకటి అందించారు. అందులో.. రాష్ట్రాల విభజన అంశాన్ని, ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రపతికి, పార్లమెంటుకు ఉన్న అధికారాలను వివరించారు.
విభజన బిల్లుపై బీఏసీ భేటీలో స్పీకర్ మనోహర్ సభ్యులందరికీ నాలుగు పేజీల వివరణాత్మక నోట్ ఒకటి అందించారు. అందులో.. రాష్ట్రాల విభజన అంశాన్ని, ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రపతికి, పార్లమెంటుకు ఉన్న అధికారాలను వివరించారు. రాష్ట్రపతి సందేశంతో కూడిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013 ముసాయిదా కేంద్ర హోంశాఖ నుంచి తనకు ఏ రోజున అందింది అనే వివరాలనూ పొందుపరిచారు. దానిపై శాసనసభ నియమనిబంధనల మేరకు ఏ విధంగా సభలో చర్చకు చేపట్టే అవకాశాలున్నాయన్న విషయంలో పలు నిబంధనలను పేర్కొన్నారు.
శాసనసభ 359 నిబంధన మేరకు సభా వ్యవహారాల నిర్వహణలో పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంటుందని తెలియజేశారు. శాసనసభ అభిప్రాయం మాత్రమే వ్యక్తపరుస్తుందని ఆ నోట్‌లో పరోక్షంగా పేర్కొన్నారు. విభజన బిల్లుపై ప్రతి సభ్యుడు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చనీ, సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయనీ, క్లాజ్ వారీగా సభ్యుల అభిప్రాయాన్ని చెప్పవచ్చని, అందుకు సమయం కేటాయించటం జరుగుతుందని, సభ్యులందరూ సంప్రదాయాలు, సభా మర్యాదలు పాటించాల్సి ఉంటుందని ఈ నోట్‌లో పేర్కొన్నారు.