వాట్ ఏ 'సిట్' ?
'ఓటుకు కోట్లు'పై సమాధానం చెప్పమంటే చంద్రబాబు 'సిట్' అంటున్నారు. పొరుగు రాష్ట్రం సీఎంపై తెలుగు తమ్ముళ్లు పెట్టిన కేసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం వేశారు. ముడుపుల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో 'బాస్' ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది టీఆర్ఎస్ కుట్ర అంటూ పల్లవి అందుకున్నారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో బాబు మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో బట్టబయలు కావడంతో 'సెక్షన్ 8' బయటకు తీశారు. 'ఫోన్ ట్యాపింగ్' అంటూ హస్తినకు పరుగెత్తారు. కేంద్రంలోని మోదీ సర్కారు నుంచి భరోసా దొరక్కపోవడంతో ఉత్తి చేతులతో ఉసూరుమంటూ తిరిగొచ్చారు.
తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచడంతో బెంబేలెత్తిన బాబు హడావుడిగా 'సిట్' ఏర్పాటు చేశారు. 'ఓటుకు కోట్లు' వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబేనని నిరూపించేందుకు ఏసీబీ సమాయత్తమవుతున్న తరుణంలో 'సిట్'తో ఎదురుదాడికి దిగారు. ఆరంభం నుంచే ఆయనది 'ఎటాకింగ్' స్వభావమేనని బాబును బాగా ఎరిగిన వారికి తెలిసిన విషయమే. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయమని రేవంత్ కు తాను చెప్పలేదని చంద్రబాబు ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ముడుపుల కేసులో జైలుకెళ్లిన రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయనూలేదు. ఆడియో టేపుల్లో వాయిస్ మీదేనా అడిగితే... 'వాట్ ఐ యామ్ సేయింగ్' అంటూ సాగదీస్తారే కానీ సమాధానం చెప్పరు. గట్టిగా అడిగితే 'నేను ముఖ్యమంత్రిని. నన్నే ప్రశ్నిస్తారా' అంటూ కన్నెర్ర జేస్తారు.
సీఎం తప్పు చేస్తే విచారించే హక్కు దర్యాప్తు సంస్థలకు లేదా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు ఎలాంటి తప్పు చేసినా మౌనంగా ఉండాలా, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకుంటే తప్పా, అధికారం ముసుగులో తప్పుడు పనులు చేసినా ఎవరూ మాట్లాడకూడదా, అడ్డంగా దొరికినా అధికారం ఉందన్న ఒకే ఒక్క కారణంతో వదిలేయాలా, ఉమ్మడి రాజధానిలో ఉన్నారన్న కారణంతో నేరాన్నినమోదు చేయకూడదా, నేరారోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి విచారణ ఎదుర్కొకూడదా. నోటీసులు తీసుకోమని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అన్నది సామాన్యుడి ప్రశ్న.
ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామని చెబుతున్న టీడీపీ సర్కారు వాటిని ఎప్పుడు బయటపెడుతుందో. ప్రధానికి రాసిన లేఖలో మత్తయ్య ఫోన్య ట్యాపింగ్ ప్రస్తావన తప్పా మిగతా 119 ఫోన్లు ట్యాప్ అయిన ప్రస్తావన ఎక్కడా లేదే. నన్ను అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అదే అఖరి రోజుని చంద్రబాబు అనడం ఏ ధోరణికి సంకేతం. తమ రాష్ట్ర పోలీసులే ఉండాలని, హైదరాబాద్ లో ఏపీ పోలీసు స్టేషన్లు పెడతామని ఏపీ కేబినెట్ అనడంలో ఆంతర్యం ఏమిటి. తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్న సాకుతో గవర్నర్ పై టీడీపీ మంత్రులు నోరుపారేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా. టీడీపీ సంక్షోభాన్ని ప్రజలపై రుద్దడం ఎంతవరకు సమంజసం?
తాను చట్టానికి అతీతుడిని అన్నట్టుగా చంద్రబాబు వ్యహరిస్తున్నారు. తాను సీఎంను కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ తరహా ధోరణి ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదనేది ప్రజాస్వామ్యవాదుల భావన. బాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటారో చూడాలి.