ఓటుకు కోట్లు కేసును సీబీఐకి అప్పగించాలి
- హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ కన్వీనర్ డిమాండ్
- కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు వెల్లడి
ఏలూరు: తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ కన్వీనర్ డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు డిమాండ్ చేశారు. ఈ రెండు కేసులు వెలుగులోకి వచ్చి ఈనెల 27కు ఏడాది కావస్తుండడంతో కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు ఆయనతోపాటు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు తెలిపారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఫతేబాద్‌సెంటర్‌లో వారు విలేకరులతో మాట్లాడారు.
ఓటుకు నోటు, ఫోన్‌ట్యాపింగ్ కేసుల్లో సృష్టమైన ఆధారాలున్నట్లు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు బహిరంగంగా ప్రకటించాయన్నారు. అయితే, తర్వాత రెండు ప్రభుత్వాలు రాజీ పడి కేసులను నీరుగార్చేస్తున్నాయని, దర్యాప్తు ఆలస్యమయ్యే కొద్దీ కీలక ఆధారాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో దేశంలో రెండు రాష్ట్రాల పాలకులు పరస్పర కేసులు పెట్టుకున్న ఉదంతాలు లేవన్నారు. ఇరు వర్గాలు రాజ్యాంగ బద్ధులై చట్టాలను కాపాడతామని ప్రమాణం చేసిన వారేనని, కానీ ఈ కేసుల్లో వారే నిందితులుగా మారారని చెప్పారు. చట్టాలను అమలు చేసే వారే నిందితులుగా మారితే వారి ఆజమాయిషీలో పనిచేసే ఆయా రాష్ట్రాల దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా పనిచేయలేవని పేర్కొన్నారు. ఈ కేసులపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వీటిని వెంటనే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
చార్జిషీట్‌లో పేరున్న చంద్రబాబుపై చర్యలేవీ?
గతంలో రెండు రాష్ట్రాల పాలకులు ఒకరిపై మరొకరు పోటీ పడి సుమారు 150 కేసులు పెట్టుకున్నారని, ఇప్పుడు వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశారన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చార్జీషీటులో ఉందని, తప్పుచేసి దొరికిపోయిన ఆయనపై ఇప్పుటి వరకు ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారని, అంత డబ్బు రేవంత్‌కు ఎక్కడి నుంచి వచ్చిందో తెలపాలని, చంద్రబాబు ఆడియో టేపులను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిర్ధారించినప్పటికీ ఆ వివరాలను ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులను వెంటనే సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయించాలని కోరారు. సమావేశంలో సామాజిక కార్యకర్త జి.సత్యనారాయణ పాల్గొన్నారు.