ఎర్రగుడిపాడులో ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్చమని అడ్మిషన్‌కార్డులు అందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నూతన ఒరవడికి నాంది పలికారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరుతూ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి తిరుగుతూ కరపత్రాల ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అర్హులైన ఉపాధ్యాయులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఉచిత విద్య, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, ఇంగ్లిష్ మీడియం వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయని, ప్రైవేట్ పాఠశాలలకు దీటైన ఫలితాలు సాధిస్తున్నామని పేర్కొంటున్నారు. టక్కు, టైలు చూసి మోసపోవద్దని, ఆడంబరాలకు పోయి ఇల్లుగుల్ల చేసుకోవద్దని సూచిస్తున్నారు. బంగారం లాంటి మా బడిలో ఒత్తిడి లేని విద్యనందిస్తామని, పిల్లల సంపూర్ణ వికాసానికి మాదీ హామీ అంటూ భరోసా ఇస్తున్నారు.
చీమకుర్తి రూరల్:ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిలిచాయి. 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడంతోపాటు నూరుశాతం ఫలితాల సాధనలోనూ ఉత్తమ ప్రదర్శన కనబర్చాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్సాహంతో ఉన్నారు. పట్టణాలు, పల్లెల్లో ఇంటింటికి తిరుగుతున్నారు. పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించండని తల్లిదండ్రులకు నచ్చచెప్తున్నారు. ప్రైవేటు బడికి, ప్రభుత్వ బడికి తేడాలను వివరిస్తున్నారు. వేసవి సెలవులను సైతం పట్టించుకోకుండా కొంతమంది ఉపాధ్యాయులు ప్రచారం నిర్వహిస్తున్న తీరు చూసి గ్రామస్తులు మార్పు మంచికే అంటున్నారు.
టెన్త్‌లో సత్ఫలితాలు..
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో సంతనూతలపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాలలో 38 ప్రభుత్వ హైస్కూళ్ళు ఉంటే వాటిలో 31 హైస్కూళ్ళలోనూరు శాతం ఉత్తీర్ణత సాధించటం ఇంకాస్థ ధీమాను పెంచింది. 1825 మంది విద్యార్థులు హాజరైతే 1816 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి విద్యార్థులు సరాసరి 95 శాతం ఉత్తీర్ణత సాధించటం విద్యార్థుల తల్లిదండ్రులలో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మన ఊరు–మన బడి, జ్ఞానధార వంటి కార్యక్రమాలు, రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఎస్‌ఎస్‌ఏ కార్యాచరణ కూడా కొంత మేర ధీమా కలిగించేందుకు దోహదపడ్డాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరితేరూ.30 వేలు మిగులు
ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కింద కట్టాల్సిన రూ.10 వేలు నుంచి రూ.15 వేలు మిగిలినట్లే. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు రూ.2500 విలువ చేసే రెండు జతల యూనిఫాం ఉచితంగా ఇస్తారు. ప్రభుత్వం, దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రూ.7 వేల విలువ చేసే పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలను అందిస్తున్నారు. వ్యాను ఫీజు, వార్షికోత్సవం ఫీజుల పేరుతో ప్రైవేటు పాఠశాలలకు ఏడాదికి చెల్లించాలసిన దాదాపు రూ.10 వేలు మిగిలినట్టే. గతేడాది వరకు మధ్యాహ్న భోజనంలో విద్యార్థికి వారానికి మూడు గుడ్లు మాత్రమే ఇచ్చేవారు. కాని ఈ విద్యాసంవత్సరం నుంచి వారానికి ఐదు కోడిగుడ్లును అందించనున్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే వారి కుటుంబానికి ఏడాది మొత్తం మీద ప్రయివేటు స్కూళ్లకు చెల్లించే రూ.30 వేలకు పైనే మిగిలినట్లేనని ప్రభుత్వ ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించి చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాప్రమాణాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయుల బోధన ఎంతగానో తోడ్పడుతుందని పిల్లల కుటుంబాలకు నచ్చచెప్పి పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేరాలని ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలను గ్రామాలలోని ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment