సాక్షి ప్రతినిధి, విజయవాడ : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై గంధం నాగేశ్వరరావు, అతడి కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలను తుపాకులతో కాల్చి చంపిన కేసులో పోలీసుల పాత్రపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బాధితులు, నిందితులతో ఏలూరు వన్‌టౌన్ పోలీసులకున్న సంబంధాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్టు తెలిసిన వెంటనే ముగ్గురినీ సస్పెండ్ చేశారు. వీరిపై కేసు నమోదుకు న్యాయపరంగా ఎదుర య్యే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో పోలీస్ అధికారికి కుట్రదారులతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో స్పెషల్ బ్రాంచి ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నక్కా సూర్యచంద్రరావు 2001లో పెదవేగి పోలీస్‌స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత సీఐగా అక్క డ పనిచేశారు.
దీంతో సూర్యచంద్రరావు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాడనే విషయాన్ని తెలుసుకునేందుకు కాల్‌డేటా పరిశీలించారు. కేసులో ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న భూతం గోవింద్‌తో ఏసీపీ అనేకసార్లు మాట్లాడినట్టు కాల్‌డేటాలో వెల్లడైంది. నిజం చెప్పకుండా నిందితునికి పరోక్షంగా సహకరిస్తున్నాడనే అనుమానంతో డీజీపీతో మాట్లాడి సూర్యచంద్రరావును వేకెన్సీ రిజర్వుకు పంపించారు. గత ఏప్రిల్‌లో భూతం దుర్గారావు హత్య జరిగిన సందర్భంలోనూ నాగరాజు వర్గీయులతో ఈ పోలీసులకు సంబంధాలు ఉండి ఉంటాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హత్యలకు కుట్రపన్నిన వారితో పోలీసులకు ఉన్న సంబంధాలపై కూపీ లాగుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లాలోని పలువురు పోలీసుల్లో వణుకు మొదలైంది.
మరో 20 మంది నిందితులు !
విజయవాడ సిటీ : ఈ మూడు హత్యలకు చిన్నపాటి సహకారం అందించిన వారిని కూడా వదలకుండా నిందితులుగా చార్జిషీటులో చేర్చనున్నారు. తద్వారా ప్రధాన నిందితులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు వీలు లేకుండా పోలీసులు పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఢిల్లీకి చెందిన షూటర్ల గ్యాంగ్ సభ్యులు ఏడుగురు, కుట్రదారుల కుటుంబాలకు చెందిన ముగ్గురిని పోలీ సులు అరెస్ట్ చేశారు. షూటర్ల ముఠాలో ఒకరు, ప్రధాన కుట్రదారుడు భూతం గోవింద్ సహా 9మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే మరికొందరిని కూడా కేసులో నిందితులుగా చేర్చాలని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. కిరాయి హంతకులకు వసతి, వాహనాలు సమకూర్చడం, కుట్రదారులతో మంతనాలు చేసేం దుకు మొబైల్ ఫోన్ల సరఫరాను ఇక్కడి వారే చేసినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. వీరందరినీ ఇప్పటికే గుర్తించామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. మూడు హత్య కేసుల్లో మరో 20 మంది వరకు నిందితులుగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
వ్యూహాత్మక అడుగులు
ఇదిలా ఉంటే.. ఈ కేసు విషయంలో పోలీసులు తొలి నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి హత్యకేసుల్లో కుట్రదారులను, హత్యలు చేసిన వారిని పోలీసులు నిందితులుగా పేర్కొంటారు.ఇందుకు అవసరమైన సహాయ సహకారం అందించిన వారిని సాక్షులుగా పేర్కొనడం పరిపాటి. సాక్షులుగా పెడితే ఎప్పుడైనా జారిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా కుట్రదారులు, హంతకులు సులువుగా శిక్షనుంచి తప్పించుకుంటారు. ఈ అంశాలను పోలీసు అధికారులు ముందుగానే ఊహించి, నిందితులకు సహాయ సహకారాలు అందించిన వారిని కూడా నిందితులుగా చేర్చడం, వారితో నేరం ఒప్పించడం, ఆపై అప్రూవర్లుగా మార్చుకుని నేరం నిరూపించడంపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ సమాచారం.
పోలీసుల పాత్రపై ప్రత్యేక దర్యాప్తు
Published Sun, Oct 19 2014 1:31 AM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM
Advertisement
Advertisement