సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య దర్యాప్తునకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. వివేకానందరెడ్డి దారుణ హత్య అధికారపక్షం పనేననే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. అదే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని పోలీసు అధికారులతో సిట్ వేస్తే వాస్తవాలు ఎలా వెలుగులోకి వస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ వివేకా దారుణ హత్య దర్యాప్తు బాధ్యతను గతంలో కడప ఎస్పీగా పనిచేసిన అభిషేక్ మహంతికి అప్పగించిన చంద్రబాబు ప్రభుత్వం.. సీఐడీ ఏడీజీ అమిత్‌గార్గ్ పర్యవేక్షిస్తారని ప్రకటించింది. అయితే వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక రాజకీయ కుట్రను వెలికితీయాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
సౌమ్యుడిగా అందరి మన్ననలు అందుకున్న వివేకానందరెడ్డి దారుణహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్సార్‌జిల్లా శోకసంద్రంలో మునిగిపోయింది. చంద్రబాబు నేతృత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చంద్రబాబు మరోసారి సిట్ డ్రామాకు తెరతీశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతిసారీ ఈ విధంగా సిట్‌ను తెరమీదకు తెచ్చి వాస్తవాలను పక్కతోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోంది.
గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమైన సంగతి తెల్సిందే. దీనిపై కూడా చంద్రబాబు సర్కారు సిట్ ఏర్పాటు చేసింది. జగన్‌పై హత్యాయత్నం వెనుక కుట్రకోణాన్ని వెలికితీయాల్సిన సిట్, ఆ అంశాన్ని పక్కన పెట్టేసి నిందితుడు శ్రీనివాసరావు చుట్టూ కథ నడిపిస్తోంది. దీంతో వాస్తవాలు వెలికితీసి తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. దాంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు హైకోర్టు ఆ కేసును అప్పగించిన సంగతి తెల్సిందే.
ఎన్ని సిట్‌లు వేసినా ఏం ఫలితం
ఎర్రచందనం కూలీల కాల్చివేత, విశాఖ భూ కుంభకోణం, కాల్‌మనీ సెక్స్‌రాకెట్, విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూకబ్జా కేసు, విశాఖ మన్యంలో మావోయిస్టులు చేసిన జంట హత్యలు వంటి కీలక ఘటనలపై వేసిన సిట్‌లతో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అనేక కేసుల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలపైనే పెద్దయెత్తున ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తుకు అదే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో నడిచే పోలీసు అధికారులతో బృందాలు ఏర్పాటు చేస్తే అవి ఏం సాధించాయో అందరికీ తెలిసిందే.
రాజమహేంద్రవరంలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 20 మంది చనిపోతే.. చంద్రబాబు నిర్వాకం కారణంగానే తొక్కిసలాట జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణకు సోమయాజులు కమిషన్ వేశారు. చివరకు మీడియా ప్రచారం వల్ల భక్తులు స్నానానికి అదే ఘాట్‌కు ఎక్కువగా రావడంతో తొక్కిసలాట జరిగి చనిపోయారంటూ ముగింపు పలికేశారు. వాస్తవానికి ప్రచారం కోసం సామాన్య భక్తులు స్నానాలు చేసే ఘాట్‌కు కుటుంబ సమేతంగా వెళ్లిన చంద్రబాబు, అక్కడ ఓ సినీ దర్శకుడితో షూటింగ్ చేయించడం తొక్కిసలాటకు దారితీసింది. అయితే ఈ విషయాన్ని మరుగునపెట్టి, చంద్రబాబును కాపాడేందుకు సోమయాజుల కమిషన్ మీడియాపై నెపం నెట్టిందంటూ జర్నలిస్టు సంఘాలు ఇటీవల పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి.
- శేషాచలం అడవుల్లో 2015 ఏప్రిల్ 7న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 20 మంది కూలీలు పోలీస్ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు. చీకటీగలకోన, సచ్చినోడిబండల్లో జరిగిన పోలీస్ కాల్పులపై పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు తీవ్రస్థాయిలో చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో 2015 ఏప్రిల్ 24న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్.రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ వేసినా సాధించింది శూన్యం.
- విశాఖపట్నం రూరల్‌లో అధికార టీడీపీకి చెందిన ముఖ్యనేతల కనుసన్నల్లో భారీయెత్తున భూ కుంభకోణం జరగిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో గతేడాది జూన్‌లో గ్రేహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
- విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూ కబ్జా కేసుతో టీడీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దీంతో విశాఖ తరహాలోనే విజయవాడ, గుంటూరుల్లో భూ వివాదాలపై సిట్ ఏర్పాటు చేసి అసలు వివాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసింది.
- రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేసిన దర్యాప్తు ఏమిటో మూడేళ్లు దాటినా అతీగతీలేదు.
- డేటా చోరీ కేసులో దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే, అందుకు ప్రతిగా తెలుగుదేశం ప్రభుత్వం రెండు సిట్‌లు వేసి హడావుడి చేసింది. ప్రభుత్వ పెద్దలే దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి రావడంతో దాన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా సృష్టించి విషయాన్ని దారి మళ్లించేందుకు సిట్‌లు ఏర్పాటు చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment