ప్రత్యేక హోదా’ కోసం.. ఆత్మాహుతి యత్నం | Special status' for the suicide attempt .. | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా’ కోసం.. ఆత్మాహుతి యత్నం

Published Thu, Aug 27 2015 2:18 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా’ కోసం..  ఆత్మాహుతి యత్నం - Sakshi

ప్రత్యేక హోదా’ కోసం.. ఆత్మాహుతి యత్నం

హోదా రాదన్న పాలకుల మాటలకు మనస్తాపం...
‘పశ్చిమ’లో ఒంటికి నిప్పంటించుకున్న చిరు వ్యాపారి దుర్గాప్రసాద్
40% కాలిన గాయాలతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స

 
ఏలూరు: ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో మునికోటి ఆత్మ బలిదానం, ఆ తర్వాత జరిగిన చావలి సుబ్బారావు ఉదంతం మరువకముందే... బుధవారం మరో ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కాదు.. ప్యాకేజేనన్న పాలకుల మాటలకు మనస్తాపానికిలోనై పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ (50) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 40 శాతం కాలిన గాయాలతోనూ ప్రత్యేకహోదా నినాదాలు చేస్తున్న ఆయన్ని కుటుంబ సభ్యులు వెంటనే తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి, అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు.

హోదా డిమాండ్‌పై నేతలకు విన్నపాలు..
కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి తిరిగొచ్చేసిన దుర్గాప్రసాద్ కైకరంలో చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేకహోదా డిమాండ్‌పై ఇటీవల నేతలకు వినతిపత్రాలు ఇస్తూ వస్తున్నారు. సీఎం చంద్రబాబు కైకరం వచ్చిన సందర్భంలోనూ,  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో నిరసన దీక్ష చేపట్టినప్పుడు, వినతిపత్రాలు సమర్పించారు. ఇదే విషయమై మంగళవారం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రత్యేకహోదా సాధించుకుని వస్తారని దుర్గాప్రసాద్ ఆశించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను మంగళవారం రాత్రి 12 గంటల వరకు టీవీలో చూస్తూ కూర్చున్నారు. ప్రత్యేకహోదా రాదని, ప్యాకేజీకి ముఖ్యమంత్రి ఒప్పుకుని వస్తున్నారన్న విషయం విని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కంటిమీద కునుకు లేకుండా అదే ఆలోచిస్తూ బుధవారం తెల్లవారు జామున 5.30గంటల సమయంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. ఆయన రెండు కాళ్లు, ఎడమ చేయి కాలిపోయాయి. ఒక్కసారిగా శరీరాన్ని మంటలు చుట్టుముట్టినా భరిస్తూ దుర్గాప్రసాద్ చేసిన ప్రత్యేకహోదా నినాదాలకు నిద్రలో ఉన్న అతని భార్య జ్యోతి, కుమార్తెలు నీరజ, నిఖిల ఉలిక్కిపడి లేచారు. ఎదురుగా మంటల్లో దుర్గాప్రసాద్ ఉండటాన్ని చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే తేరుకుని మంటలను ఆర్పారు. 108 అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు.
 
కూతురు భవిష్యత్‌పై ఆందోళనతోనే..

 ఉపాధి కోసం 2002లో కుటుంబంతో హైదరాబాద్ వెళ్లిన దుర్గాప్రసాద్ జగద్గిరిగుట్ట సమీపంలోని దేవమ్మ బస్తీలో నివాసం ఉండేవారు. అక్కడ ఒక హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. దుర్గాప్రసాద్‌కు ఉన్న ఇద్దరు ఆడపిల్లల్లో రెండో కుమార్తె నిఖిల 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడే చదివింది. దీంతో ఆమె తెలంగాణ స్థానికురాలైంది. ప్రత్యేక వాదం ఊపందుకున్న 2007లోనే దుర్గాప్రసాద్ కుటుంబం స్వస్థలమైన ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి తిరిగొచ్చేసింది. కాగా, నిఖిల డీఎస్సీ పరీక్ష రాసే విషయంలో స్థానికత సమస్య ఎదురైంది. ఐదేళ్లపాటు తెలంగాణలో చదవడంతో అవుట్ ఆఫ్ స్టేట్‌గా ఆమెను పరిగణించారు. దీంతో ఆంధ్రాలో పరీక్ష రాసే అవకాశం రాలేదు. అటు తెలంగాణలోనూ ఆంధ్రా అభ్యర్థిగా పరీక్ష రాసే అవకాశాన్ని నిఖిలకు కల్పించలేదు. ఈ క్రమంలో బిడ్డ భవిష్యత్ కోసం దుర్గాప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇక్కడ డీఎస్సీ రాసేందుకు అనుమతి వచ్చింది. డీఎస్సీ పరీక్ష  రాసినా ఫలితాలు వెల్లడించకుండా విత్‌హెల్డ్(నిలిపివేయడం)లో ఉంచారు. ఇలాంటి వారు సుమారు 900మంది ఉండటంతో వీరంతా కోర్టును ఆశ్రయించారు.

ప్రత్యేకహోదా వస్తే వారితోపాటు తనబిడ్డ భవిష్యత్, తద్వారా రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని దుర్గాప్రసాద్ ఆశించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోప్రత్యేకహోదా రాదని స్పష్టమైన సంకేతాలు రావడంతో తన బిడ్డకు ఉద్యోగం రాదనే నిరాశ, నిస్పృహలకు దుర్గాప్రసాద్ లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే తన ఆత్మహత్య ద్వారా కొందరికైనా ప్రయోజనం కలుగుతుందని భావించి ఒంటికి నిప్పంటించుకున్నానని చెబుతున్నారు. ప్రత్యేకహోదా కోరుతూ ప్రతిరోజూ తెల్లకాగితాలపై నినాదాలు రాసే అలవాటు దుర్గాప్రసాద్‌కు ఉంది. అదే క్రమంలో ఆత్మహత్యాయత్నానికి ముందు కూడా నినాదాలను కాగితాలపై రాశారు.

 జగన్ వల్లే హోదా సాధ్యం:రాష్ట్రానికి ప్రత్యేకహోదా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమని దుర్గాప్రసాద్ అన్నారు. తాడేపల్లిగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌ను చూడాలని ఉందని, ఆయన ద్వారానే తనకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. తనకు బతకాలని ఉందని. ప్రత్యేకహోదా కోసం ఉద్యమించాలని ఉందని కన్నీళ్లపర్యంతమయ్యారు.

మెరుగైన చికిత్స కోసం.. గుంటూరు  ఆస్పత్రికి పంపిన వైసీపీ నేతలు
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గాప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మోహన్‌తో  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉంగుటూరు పార్టీ ఇన్‌చార్జ్ పుప్పాల వాసుబాబు మాట్లాడారు. గుంటూరు జీజీహెచ్‌లో మెరుగైన చికిత్స అందుతుందని డాక్టర్ మోహన్ చెప్పడంతో వైసీపీ నేతలు దగ్గరుండి పంపించే ఏర్పాట్లు చేశారు. కాగా, పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఫోన్‌లో దుర్గాప్రసాద్‌తో మాట్లాడారు. కాంగ్రెస్ తరఫున రూ.25 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారు.
 
అసెంబ్లీలో చర్చిస్తా... ధైర్యంగా ఉండండి ఫోన్‌లో జగన్ పరామర్శ
 రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సుందరపు ప్రసాద్‌ను రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు. రానున్న రోజుల్లో ప్రసాద్‌కు పార్టీ అండగా ఉంటుందనీ, ప్రత్యేకహోదాపై అందరూ కలిసి పోరాడాలే తప్ప ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని వైఎస్ జగన్ సూచించారు. ప్రత్యేకహోదా విషయమై అసెంబ్లీలో లేవనెత్తుతానని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని దుర్గాప్రసాద్‌కు భరోసా ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement