అందుకే అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి! | Special Story On Ashada Masam | Sakshi
Sakshi News home page

ఆశలమేఘం ‘ఆషాడం’

Published Thu, Jul 4 2019 11:44 AM | Last Updated on Thu, Jul 4 2019 12:52 PM

Special Story On Ashada Masam - Sakshi

సాక్షి, విశాఖపట్టణం :  ఆషాఢమాసం ప్రారంభమైంది. కొత్తగా వివాహమైన కోడలు అత్తారింటిలో ఈ మాసంలో ఉండకూడదన్న విశ్వాసం ఉంది. ఈ మాసమంతా ఎలాంటి శుభ కార్యాలు కూడా చేయరు. ఏటా చిన్నా, పెద్ద ముహుర్తాలు తొమ్మిది నెలల పాటు ఉంటాయి. కేవలం ఆషాఢం, పుష్యం, భాద్రపదం మాసాలలో మాత్రమే శుభముహూర్తాలు ఉండవు. మిగతా తొమ్మిది మాసాలు ముహూర్తాలు వరసగా ఉంటాయి. ఈసారి ఆషాఢం, భాద్రపదానికి తోడు శుక్రమౌఢ్యంతో శ్రావణమాసం రావడంతో మంచి ముహూర్తాలకు విరామం ఏర్పడింది. శుక్రమౌఢ్యం ఉన్న రోజుల్లో పెద్ద శుభ కార్యాలు చేయరు. కేవలం నామకరణాలు, జన్మదినోత్సవాల లాంటివి మాత్రమే చేసుకోవచ్చునని పండితులు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో మౌఢ్యం నియమం పాటించని వారు మాత్రం శుభకార్యాలు నిర్వహిస్తారు.

ఆషాఢం ఆఫర్ల వరద
ఈ మాసం వస్తుందంటే వ్యాపారులు ఆఫర్లతో ఊదరగొట్టేస్తారు. వస్త్రాల నుంచి నగల వరకు మార్కెట్‌లో ప్రత్యేక బహుమతులతో, ధరలతో అలంకార ప్రియు లను ఆకర్షిస్తారు. తూకాల్లో వస్త్రాల విక్రయాలు, ఒకటి కొంటే ఒకటి ఉచితం, లక్కీ డ్రాలు తదితర ఆకర్షణీయ ప్రకటనలతో కొనుగోలుదారులను వ్యాపారులు ‘రారండి’అంటూ ఆహ్వానించేలా ఆఫర్లు ఇస్తారు.

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి
కొత్తగా పెళ్లయిన జంట ఒకరిని విడిచి ఒకరు ఉండి తీరాలన్న కఠిన నిబంధనను ఆషాఢ మాసమంతా అనుసరిస్తారు. ఎందుకంటే సాగు పనులు పుష్కలంగా ఉండే ఈ సీజన్‌లో కొత్త అల్లుడికి మర్యాదలు సరిగా చేయలేమనే భావన, సాగు పనులు స్తంభించిపోతాయనే ఆలోచన ఈ నిబంధనకు కారణంగా చెప్తారు. పైగా ఈ సమయంలో గర్భధారణ అంత ఆరోగ్యకరం కాదు. పరిసరాల్లోని నీళ్లు కలుషితం అయి ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యాధులు విస్తరించే కాలంలో అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో పాటు ఈ కాలంలో గర్భధారణ జరిగితే ప్రసవం వచ్చే ఎండాకాలంలో జరిగే అవకాశం ఉంటుంది. తీవ్ర మైన ఎండలు కాచే సమయం ఉదయించే శిశువుకు మంచిది కాదు. ఈ నెల వియోగం పాటిస్తే జూలై, ఆగస్టుల్లో ప్రసవం జరుగుతుంది. ఇన్ని కారణాలున్నాయి కాబట్టి ఎడబాటు మంచిదే.

మూడు నెలలు ఖాళీనే.. 
శుభ ముహూర్తాలు లేకపోవడంతో ముఖ్యంగా వివాహాలకు అనువైన రోజులు లేకపోవడంతో.. ఫంక్షన్‌ హాళ్లు, సంబంధిత వ్యాపారాలు కళ తప్పనున్నాయి. శూన్యమాసాలాకు తోడు మౌడ్యమి రావడంతో పెళ్లిళ్లు చేసుకునే అవకాశాలు తక్కువ. శుభ కార్యాలపై ఆధారపడి జీవించే వేలాదిమందికి ఈ విరామం కాలం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. టైలర్లు, బాణాసంచా, భాజాభజంత్రీలు, వంట మాస్టర్లు, కూలీలు, పారిశుద్ధ్య ›పనులు చేసేవారికి రోజు వారీ కూలీ లభించే అవకాశం ఉండదు. పందిళ్లు, షామియానాలకు కూడా గిరాకీ తగ్గనుంది. ఫంక్షన్‌ హాళ్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, పురోహితులకు కూడా చేతినిండా పని ఉండదు.

అక్టోబర్‌ నుంచి మంచి రోజులు
‘అక్టోబరు 2 నుంచి మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ముహూర్తాలు డిసెంబర్‌ 12 వరకు కొనసాగుతాయి. డిసెంబర్‌ 14 నుంచి గురు మౌఢ్యమి కారణంగా మార్గశిర మాసంలో శుభ కార్యాలకు కాస్త విరామం ఏర్పడుతుంది. గురుమౌఢ్యమి జనవరి 10తో ముగియనున్నప్పటికీ పుష్య మాసం ఉండడంతో వివాహాలు, తదితర శుభ కార్యాల కోసం మంచి ముహూర్తాలు లేవు. శుభ ముహూర్తాలు తిరిగి మాఘమాసం అంటే జనవరి 26 నుంచి మాత్రమే ప్రారంభం కానున్నాయి’ అని వేద పండితులు చెబుతున్నారు.

శుభకార్యాలకు విరామం
మనదేశం వ్యవసాయ ప్రధానమైంది. ప్రతీ పల్లెలో వ్యవసాయాధారిత కుటుంబాలు ఉంటాయి. చినుకులు కురిసి ఖరీఫ్‌ పంటలకు అనుకూలంగా ఉండేది ఇదే నెలలో. సాగు పనులు, దుక్కి దున్నడం, నాట్లు వేయడం తదితర కార్యక్రమాలన్నీ చేస్తారు. సేద్యపు పనులకు ఆటంకాలు ఉండకూడదు కాబట్టి శుభకార్యాలు జరిపే వీలు ఉండదు.

భానుసప్తమి
ఆషాఢమాసంలో వచ్చే ఏడో రోజు అనగా సప్తమి తిథిని భాను సప్తమి,రథ సప్తమిగా భావిస్తారు. ప్రకృతికంతటికీ వెలుగు ప్రసాదించి సూర్యున్ని దైవంగా భావించడం ఈ తిథి ప్రత్యేకం. ఏడు గుర్రాల రేడు అనగా ఏడు వర్ణాల మేళవింపు అయిన సూర్యకాంతి కారణంగానే ప్రకృతి పచ్చటి శోభను సంతరించుకుంటుంది కాబట్టి సనాతన ధర్మం ప్రకారం సూర్యుడు సైతం దైవ సమానుడయ్యాడు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు పయనిస్తున్న సూర్యుడు మూడునెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున రాత్రి, పగలు, క్షణం కూడా తేడా లేకుండా సమానంగా ఉంటాయి.  

తొలిపండుగ ఏకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజునే తొలి ఏకాదశి అంటారు. త్రిలోక పరిపాలకుడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునేందుకు ఎంచుకున్న రోజిది కాబట్టి ఇది శయన ఏకాదశి. తిరిగి నాలుగు నెలల తర్వాత ఉత్థాన ఏకాదశి రోజున మేలుకుని ఉత్తరద్వార దర్శనం ఇస్తాడు. అందుకే ఈ నాలుగునెలల పాటు ఆధ్యాత్మిక సంప్రదాయ వాదులు చాతుర్మాస దీక్షలు ఆచరిస్తారు. క్రిమి కీటకాదులు అతిగా సంచరించే అవకాశం ఉన్నందును ముని దీక్షలు ఆచరించే వారు బయట తిరగకుండా ఆశ్రమాల్లోనే ఈ దీక్షలను ఆచరించేవారు.

వ్యాస పూర్ణిమ
తల్లిదండ్రుల తర్వాత దైవ సమానంగా భావించే గురు పౌర్ణమి ఇదే మాసంలో వస్తుంది. త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురుపూర్ణిమ. వేదాలను సృష్టించిన వ్యాస మహర్షినే ఆదిగురువుగా భావించి వ్యాస పౌర్ణమిని గురు పూజోత్సవంగా జరుపుకుంటారు. పంచమ వేదం మహాభారతం, శ్రీమద్భాగవతం లాంటి పరమోన్నత సంపద అందించిన వేద వ్యాసుడుని తొలి గురు వుగా భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది.

మగువలు ఇష్టపడే గోరింటాకు
ఆషాఢం వచ్చేసింది. అర చేతిలో గోరింటాకు పండుతోంది. మగువల అలంకరణలో గోరింటాకు అగ్రస్థానంలో ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో విచ్చలవిడిగా మెహిందీలు, కోన్‌లు దొరుకుతున్నా గోరింటకున్న ప్రాధాన్యం దానిదే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తప్ప పట్టణ ప్రాంతాల్లో గోరింట మొక్కలు దాదాపు కనుమరుగయ్యాయి. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు పల్లెల్లో గోరింటాకు పెట్టుకోవడం మహిళలకు సంప్రదాయంగా వస్తోంది. 

ఈ మాసంలోనే లేతాకు లభ్యం
వాస్తవానికి ఆషాఢ మాసంలోనే లేత గోరింటాకు దొరుకుతుంది. లేతాకైతేనే బాగా పండుతుందని మహిళల నమ్మకం. వర్షాలు పడిన తరువాత చిగురించిన లేత గోరింటాకును నూరి చేతులు, కాళ్లకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. ఇంట్లో పనులన్నీ అయిపోయాక పడుకునే ముందు కుటుంబమంతా ఓ చోట చేరి గోరింటాకు ముద్దను మహిళల చేతులు, కాళ్లకు నచ్చిన డిజైన్లతో అలంకరించి రాత్రంతా ఉంచుకుంటారు. తెల్లవారు జామున పండిన గోరింటాకును చూసుకుంటూ మురిసిపోతారు. నీదెలా పండిందో.. నాదెలా పండిందో చూపించంటూ చిన్నా, పెద్దా తేడా లేకుండా మురిసి పోతుంటారు. 

కమ్మరేకుకు కూడా ప్రాధాన్యమే..
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గోరింటాకు నూరేటప్పుడు కమ్మరేకులకు కూడా అధిక ప్రాధాన్యమిచ్చేవారు. సిద్ధం చేసుకున్న గోరింట మిశ్రమాన్ని బట్టి మూడిళ్లు లేదా ఆరిళ్ల తాలూకా కమ్మ రేకుల ముక్కలను సేకరించి గోరింటాకులో కలిపి మెత్తగా నూరేవారు. ఇలా చేస్తే బాగా పండటమే కాకుండా ఎక్కువ రోజులు చేతులు, కాళ్లకు పట్టి ఉంటుందని ఉంటుందని మహిళల నమ్మకం. మారుతున్న పరిస్థితుల బట్టి గ్రామాల్లో గోరింటాకును నూరడానికి ఉపయోగించే రోళ్లు కూడా కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో మిక్సీలు వచ్చి పడ్డాయి. శ్రమతో కూడుకున్న పని కావడంతో కాస్తా ఓపికున్న వారు గోరింటాకును మిక్సీలో తయారు చేసుకుంటుంటే, మరికొందరు మెహిందీ, కోన్‌లను ఉపయోగిస్తూ ఆధునిక పోకడలకు పోతున్నారు.

సైన్స్‌ ఇలా చెబుతుంది
గోరింటాకు మంచి యాంటీ బయాటిక్‌గా పని చేస్తుందని సైన్స్‌ చెబుతుంది. ఒకప్పుడు మన జీవనం పూర్తి వ్యవసాయాధారితం. మృగశిరలో నారుమళ్లు వేయడం, ఆషాఢంలో నాట్లు వేయడమనేది సంప్రదాయంగా వస్తోంది. గతంలో రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పొలం పనుల్లో ఎక్కువగా పాల్గొనేవారు. దీనివల్ల మట్టి, మురుగునీరు కాళ్లు చేతులు ద్వారా శరీరంలోకి ప్రవేశించి జ్వరాలు, చర్మవ్యాధులు వంటి రోగాల బారిన పడటం జరిగేది. ఇప్పటికీ అదే సమస్యను చూస్తూ ఉన్నాం. గోరింటాకు పెట్టుకుంటే యాంటీ బయాటిక్‌గా పనిచేసి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా గోరింటాకుకు ప్రముఖ స్థానముంది. రాన్రానూ దానిస్థానంలో కోన్‌లు రావడం, మెహిందీలంటూ కొత్త కొత్త డిజైన్లు రావడంతో గోరింటాకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. రసాయనాలు కలిగి ఉండే కోన్ల వల్ల చర్మవ్యాధులు వస్తుండటం గమనర్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement