దేవుడిచ్చిన అమ్మ | special story on Janakamma | Sakshi
Sakshi News home page

దేవుడిచ్చిన అమ్మ

Published Sun, Feb 25 2018 11:45 AM | Last Updated on Sun, Feb 25 2018 11:45 AM

special story on Janakamma - Sakshi

వెంకాయమ్మగారూ... భోజనం చేశారా...
ఆ తల్లి వచ్చి నాకు తినిపించిందయ్యా...
శాంతకుమారిగారూ... మాత్రలు వేసుకున్నారా...
ఆ అమ్మాయి మింగించేసిందయ్యా...
ఏమ్మా మీ బట్టలు మార్పించిందెవరు?..
ఇంకెవరు ఆ అమ్మే.
సీతామాలక్ష్మిగారూ... కూరలు బాగున్నాయా...
ఆ అమ్మ చేతివంట గురించి వేరే చెప్పాలా నాయనా...
ఇంతమంది చెప్పేది ఒకే ఒక్కరి గురించి. ఆమే జానకమ్మ. విజయనగరం ప్రేమసమాజంలో ఉండే ఏ వృద్ధురాలిని కదిపినా... అందరూ చెప్పేది అందులో పనిచేసే జానకమ్మ గురించే. అదీ జానకమ్మకు... ఆ ప్రేమ సమాజానికీ ఉన్న అనుబంధం. అది ఈ నాటిది కాదు. దాదాపు 30 ఏళ్లుగా ఆమె అక్కడివారితో పెనవేసుకుపోయారు. ఇంతకీ ఆ జానకమ్మ ఎవరు... ఎందుకు అంతగా అందరితో మమేకమయ్యారో తెలుసుకోవాలంటే ఆమె గురించి మొదట తెలుసుకోవాలి.   
         

సాక్షి ప్రతినిధి, విజయనగరం :
కట్టుకున్న భర్త అర్ధంతరంగా కాలం చేశారు. అత్తవారింట వాతావరణం అనుకూలంగా లేదు. కన్నవారింటికెళ్దామంటే చిన్నతనం అనిపించింది. పైగా వారి మనసు ఎంత బాధపడుతుందోనన్న బాధ. రోడ్డుపైకి వచ్చేసింది. కానీ ఎలా బతకాలి. పొత్తిళ్లలో చిన్నారి... బాధ్యతను గుర్తు చేసింది. ఆమె ఆకలి తీర్చడానికైనా ఏదో పనిచేసుకోవాలి. ఎలా... ఒంటరి మహిళకు సమాజంలో ఎలాంటి విలువ ఉంటుందో వేరే చెప్పాలా... చివరకు ఎవరో చెప్పారు ప్రేమసమాజం గురించి. ఎలాగో వెదుక్కుంటూ అక్కడకు చేరిన ఆమెకు అక్కడి నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. అందులోని వృద్ధులందరికీ సేవలు చేస్తూ... వారందరి తలలో నాలుకయ్యారు. అందరికీ తానే వండి... స్వయంగా తినిపిస్తున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా... నేనున్నాననే నమ్మకాన్ని వారిలో కలిగించారు. చివరకు ఎవరైనా కాలం చేస్తే వారి కర్మకాండలూ చేశారు. అలా.. 29ఏళ్లుగా ఆ ప్రాంగణంలోని ప్రతి అణువుకూ ఆమె దగ్గరయ్యారు. ఆమే జానకమ్మ. ఆమె ఎక్కడినుంచి వచ్చారు... ఆమె జీవితం ఎందుకలా అయ్యిందో ఆ కథ
ఆమె మాటల్లోనే...

అత్తవారింట ఉండలేక...
మాది ఒడిశా రాష్ట్రం. 33 ఏళ్ల క్రితం విజయనగరం పట్టణా నికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన రెండేళ్లకే నా భర్త మరణించారు. అప్పటికే నా కడుపులో ఓ నలుసు పడింది. ఆ దారుణ విషాదాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో కన్నీళ్లతోనే అత్తవారింటికి వచ్చాను. నాకు ఒక పాప పుట్టిం ది. రెండేళ్లు అత్తవారింట్లోనే ఉన్నాను. కానీ అక్కడి సరిస్థితులు నన్ను ఉండనివ్వలేదు. పుట్టింటికి వెళ్లి కన్నవారికి భారం కావాలనుకోలేదు. సొంత ఊరికి వెళ్లి అవమానాల పాలు కాదలచుకోలేదు. అత్త వారింట సంతోషంగానే ఉన్నాననే తృప్తిని సొంతూరికి, తల్లిదండ్రులకు మిగల్చాలనుకున్నాను. ఎవరికీ భారం కాకుండా నా బతుకు నేను బతకాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా.. ఈ ఊరిలో నాకెవరూ తెలియదు. ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాలేదు. ఏ పని చేయాలో తెలియలేదు. అప్పుడే నాకు ‘ప్రేమ సమాజం’ గురించి తెలిసింది.

ఆదరించిన ప్రేమ సమాజం
రెండేళ్ల బిడ్డను చంకలో పెట్టుకుని ప్రేమసమాజం తలుపు తట్టాను. నిర్వాహకులకు నా పరిస్థితిని వివరించాను. ఎక్కడైనా ఉద్యోగం చూస్తాం చేస్తావా అని అడిగారు. జీతం కోసం పనిచేయడం నా అభిమతం కాదని, నాకు నా కూతురికి నీడ కల్పించి కడుపుకింత ముద్ద పెట్టమని వేడుకున్నాను. నా పరిస్థితి చూసి వారు కరిగిపోయారు. ప్రేమ సమాజంలో ఆశ్రయం కల్పించారు. అప్పటి నుంచి నాకూ, నా కూతురికీ ఇదే ఇల్లు. ఇక్కడ ఉండే అనాథ వృద్ధులను చూసి నా మనసు చలించిపోయింది. ఎవరూ లేని వాళ్ల మానసిక దుస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వారికి ఆ లోటు రానివ్వకూడదనుకున్నాను. వారినే దైవాలుగా భావించి సేవలు చేయడం మొదలుపెట్టాను. ఇక ఆ తర్వాత పుట్టినింటికిగానీ, మెట్టినింటికిగానీ వెళ్లాలనిపించలేదు. ఇరవై తొమ్మిదేళ్లు ఇలాగే గడిచిపోయాయి.

వారి సేవలోనే హాయి
ఉదయం నుంచి రాత్రి వరకూ అమ్మల ఆలనాపాలనా చూసుకుంటున్నాను. వారికి పొద్దున్నే అల్పాహారం దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకూ అన్నీ సమయానికి పెడుతుంటాం. నాతో పాటు చెల్లిలా లక్ష్మి ఉంటోంది. ఆమె నాకు ఇరవై ఏళ్లుగా అన్నిటిలో తోడవుతోంది. నేను వంట చేసి అమ్మలకు పెడుతుంటాను. లక్ష్మి వారికి దుస్తులు మారుస్తుంటుంది. ఇక్కడ ఉన్న వారిలో 90 ఏళ్లు పైబడిన వారూ ఉన్నారు. వారిలో ఓ అమ్మ శాంత కుమా రి. ఆమెకు ఓ చేయి లేదు. మంచంపై నుంచి లేచి నడవలేదు. ఆమెకు నేనే అన్నం కలిపి ముద్దలు తినిపించాలి. బూచి వెంకాయమ్మ అనే అమ్మకు ఉన్న ఒక్క కొడుకూ కాలం చేయడంతో మనుమరాళ్లకు భారం కాలేక మా దగ్గరకు వచ్చారు.

ఆమె ఎన్నో మంచి విషయాలను చెబుతుం టారు. ఇలా ఇక్కడున్న ప్రతి ఒక్కరిదీ ఒక్కో కన్నీటి వ్యధ. మూడు దశాబ్దాలలో దాదాపు 350 మంది ఇక్కడే తుదిశ్వాస విడిచారు. వారి సంబంధీకులెవరూ రాలేదు. నేనే అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. నాతో పాటు ఇంత మంది అమ్మలకు ఆశ్రయం ఇచ్చిన ప్రేమసమాజం అధ్యక్షులు డి.ఎస్‌.ఆర్‌.మూర్తి, కార్యదర్శి పెద్దింటి అప్పారావు మాకు ప్రత్యక్ష దేవుళ్లు. మేనేజర్‌ రమణ మమ్మల్ని తోబుట్టుల్లా చూసుకుంటున్నారు. అందుకే ప్రాణం ఉన్నంత వరకూ ఈ ప్రేమ సమాజంలో ఇలాంటి ఎంతోమంది అమ్మలకు సేవ చేస్తూ గడిపేస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement