సాక్షి, ఒంగోలు: ‘సముద్రం జ్ఞానమైతే ఒక వెన్నెల రాత్రి పడవ మీద ప్రయాణించగలగటం ఒక మధురానుభూతి. జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి’ అనే డాక్టర్ మాచవరపు ఆదినారాయణ ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకు సమీపంలోని చవటపాలెం గ్రామ నివాసి. ఒంగోలు సీఎస్‌ఆర్ శర్మా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆదినారాయణ ఆ తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. ‘ఇండియన్ ట్రావెలర్ ఇన్ రష్యా’ అనే పేరుతో రష్యన్ పత్రికలు డాక్టర్ ఆదినారాయణ గురించి వ్యాసాలు రాశాయి.
జీవిత విశేషాలు
డాక్టర్ ఆదినారాయణ ప్రయాణానుభవాలకి, ఆయన మైండ్ సెట్‌కీ ఒక కలయిక ఉంటుంది. ‘ఎగుడుదిగుడు కాలిబాటలు నా స్వర్గద్వారాలు’ అంటూ తన జీవిత లక్ష్యాన్ని చాటిచెప్పారాయన. ‘ఎన్ని దేశాలు తిరిగినా, కొత్త ప్రదేశం అంటూ ఏదీ అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ. ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం’ అంటారు. విశ్వమానవీయతను చాటే డాక్టర్ ఆదినారాయణ ప్రపంచానికి పక్కా లోకల్‌గా అనిపిస్తాడు. ఆయన స్వయంగా శిల్పి, చిత్రకారుడు. కొండలు, పర్వతాలు అధిరోహించటం, వాగులు, వంకలు, లోయల్లో ప్రయాణించడం, గ్రామీణ జీవితంలో లీనం కావడం, అక్కడి వనరుల్లోనే సర్దుకుపోవడం ఆయన తన ప్రయాణాల్లో నేర్చుకున్న అంశాలు. ఇప్పటి వరకు 7 ఖండాల్లో 30కి పైగా దేశాల్లో ఆయన పాదయాత్రలు చేశారు. ఈ క్రమంలో 30 వేల కిలోమీటర్లకు పైగా నడిచారు.
ఆయన నడిచినంతమేరా ఆయా ప్రాంతాల భౌగోళిక విశేషాలు, కళ, సంస్కృతి, మతం, సారస్వతం, ఆహారం, ఆహార్యం, గృహ నిర్మాణం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కుటుంబ జీవిత నిర్మాణం, జీవన శైలి, వృత్తులు, విరామ సమయాల కాలక్షేపాలు పరిశీలిస్తారు. తన పరిశీలనలోకి వచ్చిన విషయాలను అక్షరీకరించి పుస్తకాలు రాస్తారు. ‘కదిలే పంజరం లాంటి ఈ శరీరంలో స్థిరంగా ఉండలేక, బంధాల్ని తెగ్టొట్టుకుని బయటికి వచ్చిన ప్రయాణాల పక్షిని నేను’ అన్న సొంత విచక్షణ కలిగిన డాక్టర్ ఆదినారాయణ కాలినడకతో ప్రపంచాన్ని చుట్టివచ్చారు. తన మీద ప్రభావం చూపిన వ్యక్తుల గురించి చెబుతూ.. ‘‘మా తాతయ్య వైకుంఠ పెరుమాళ్లు మాదిరిగా పాటలు పాడుకుంటూ, ప్రకృతిని పూజించుకుంటూ పూర్తిస్థాయి దేశదిమ్మరిగా మారిపోదాం’ అనేవారు. డిగ్రీ చదువుకునే రోజుల్లో లోకసంచారిగా ఉండాలని తీర్మానించుకున్నా. ‘ఒరే చిన్న గాలోడా’ అని చిన్నప్పుడు మా అమ్మ పిలిచేది. ఆ పిలుపును సార్థకం చేసుకున్నా’’ అని చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.
ఆయన ప్రయాణాల్లో కొన్ని..
ఆసియా ఖండంలోని నేపాల్(2009), భూటాన్(2010), ఇరాన్(2011), చైనా(2013), ఐరోపాలోని స్వీడన్(2012), నార్వే(2014), ఇటలీ(2014), బ్రిటన్(2015), స్కాట్లాండ్(2015), ఉత్తర అమెరికాలోని మెక్సికో(2014), దక్షిణ అమెరికాలోని బ్రెజిల్(2016), ఆఫ్రికాలోని నైజీరియా(2013), ఆస్ట్రేలియాలోని తాస్మానియా(2015)లో ఆయన చేసిన ప్రయాణాల తాలూకు విశేషాలను ఆయన రాసిన ‘భూభ్రమణ కాంక్ష’లో పొందుపరిచారు. ఇటీవల రష్యా పత్రికల్లో ఆయన ప్రముఖంగా నిలిచారు. రష్యన్ కాలమిస్టు దిమిత్రో త్యికోటిన్ ‘వెలుగు–విజయం’ పేరుతో రాసిన వ్యాసం సాహిత్య లోకంలో చర్చనీయాంశమైంది. ఏ దేశం వెళితే ఆ దేశ భాష నేర్చుకునే స్కాలర్ జిప్సీ, ఇండియన్ మార్కోపోలోగా పేరు గడించిన డాక్టర్ ఎం.ఆదినారాయణ మన జిల్లా వాసి కావడం విశేషం.
‘తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది’ – డాక్టర్ మాచవరపు ఆదినారాయణ
Comments
Please login to add a commentAdd a comment