
జీజీహెచ్‌లో కాలిన గాయాలతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తిని వరండాలో మంచంపై ఉంచిన దృశ్యం
సోమవారం తాడికొండ మండలం గరికపాడుకు చెందిన ముగ్గురు టీడీపీ యువ కార్యకర్తలు విద్యుత్‌షాక్‌కు గురై గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. వారికి కనీస వైద్య సౌకర్యాలు లేకపోవటంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు ఆస్పత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధితులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలన్నారు. ఈ ఒక్క సంఘటన చాలు జీజీహెచ్‌లో కాలిన గాయాల వారికి ఏ మాత్రం వైద్యసేవలు అందుతున్నాయో చెప్పడానికి.
గుంటూరు మెడికల్ : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై శరీరం కాలిన వారికి, లేదా పెట్రోలు, కిరోసిన్ మంటలు అంటుకుని చర్మం కాలిన వారికి రాష్ట్ర రాజధానిలో పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో సౌకర్యాలు లేవు. కొందరు తీవ్ర గాయాలపాలై వారం రోజుల వ్యవధిలో మరణిస్తుండగా మరి కొందరు నెల రోజుల్లో కాలం చేస్తున్నారు. కాలినగాయాల వారికి ప్రత్యేకంగా వార్డు, వైద్య సిబ్బంది లేకపోవటంతో జీజీహెచ్‌కు వచ్చిన బాధితులు దేవుడిపై భారం వేసి మృత్యువుతో పోరాడుతున్నారు.
నెలలో 20 మందికిపైగా...
ప్రతి నెలా జనరల్ సర్జరీ విభాగంలో 20 మందికిపైగా కాలిన గాయాల వారు చికిత్స పొందుతున్నారు. ప్రత్యేకంగా వార్డు కేటాయించకపోవటంతో జనరల్ సర్జరీ వార్డుకు చెందిన ఆరు గదుల్లో కాలిన గాయాల వారిని అడ్మిట్ చేస్తున్నారు. వీరిని ఇతర వ్యాధి ఉన్నవారిని ఒకే చోట ఉంచితే ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదముండటంతో ఆస్పత్రి వరండాల్లోనే ఉంచి తూతూమంత్రంగా వైద్యం చేస్తున్నారు. వర్షం వచ్చిన సమయంలో వరండాల్లో ఉండే బాధితులు తడిసిపోతున్నారు. రాత్రి వేళల్లో చలికి, దోమల దాడికి మరి కొన్ని అదనపు రోగాలు అంటుకుంటున్నాయి. రెగ్యులర్‌గా డ్రెస్సింగ్ చేయటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకపోవటంతో ఆస్పత్రికి వచ్చిన వారిలో 30 శాతంలోపు కాలిన గాయాలు వారు మాత్రమే ప్రాణాలతో బయట పడుతున్నారు. వేసవిలో వీరి బాధలు వర్ణణాతీతం. కొద్దోగొప్పో ప్రాణాలతో ఉన్న వారు సైతం వసతులలేమి, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో వేసవిలో చనిపోతున్నారు.
ఇవీ నిబంధనలు
నిబంధనల ప్రకారం కాలిన గాయాల వారికి ప్రత్యేకంగా వార్డు ఉండాలి. అందులో 24 గంటలు ఏసీ సౌకర్యం తప్పనిసరి. గాయాలకు ప్రతి రోజూ డ్రెస్సింగ్ చేయాలి. దీని కోసం ప్రత్యేకంగా రూమ్ నిర్మించాలి. తీవ్రతను బట్టి జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. కాలిన చోట మృతకణాలను తొలగిస్తూ ఆపరేషన్లు చేయాలి. వార్డులోనే ల్యాబ్ సౌకర్యం ఉండాలి. కానీ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఇలాంటి సౌకర్యాలేమీ ఉండవు. నిరుపేదలు అగ్ని ప్రమాదవాలకు గురైతే వారి ఖర్మ కాలినట్లే.
కేంద్రం నిధులివ్వాలి
జీజీహెచ్‌లో 20 పడకలతో కాలిన గాయాల వారికి ప్రత్యేకంగా వార్డు నిర్మించేందుకు కేంద్రం రెండేళ్ల క్రితం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా కేంద్ర బృందం సైతం తనిఖీలు చేసింది. ప్రత్యేక వార్డు వస్తే మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ వార్డుల్లో వైద్యులు కాలిన గాయాల వారికి సేవలందిస్తున్నారు.
డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్.
అంతా దైవాధీనమే...
కేంద్ర ప్రభుత్వం జీజీహెచ్‌లో కాలిన గాయాలవారికి ప్రత్యేకంగా వార్డును కేటాయిస్తామని, అందుకోసం నిధులు ఇస్తామని 2014లో ప్రకటించింది. కేంద్ర వైద్య బృందం సైతం 2015 సెప్టెంబర్‌లో కాలిన గాయాల వారికి ప్రత్యేక వార్డు నిర్మించేందుకు జీజీహెచ్‌లో తనిఖీ చేసింది. కానీ నేటి వరకు ఎలాంటి హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధాని ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయించేందుకు చొరవ చూపకపోవటంతో బాధితుల వేదనకు అంతే లేకుండా పోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ చూపి కాలిన గాయాల వారికి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment