తిరుపతిలోని మదనపల్లెలో రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి.
మదనపల్లె : తిరుపతిలోని మదనపల్లెలో రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి. శుక్రవారం స్థానిక గంగమ్మ ఆలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పూజా కార్యక్రమంలో పట్టణానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లె పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురవాలని కోరుతూ భక్తిశ్రద్ధలతో మహిళలు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగమ్మ ఆలయం ముందు నిమ్మకాయలతో తయారు చేసిన ప్రత్యేక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఉపవాస దీక్షలతో ఈ పూజలను చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రతి శుక్రవారం ఈ ఆలయం ముందు రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మదనపల్లెతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అమ్మవారిని నూతన పట్టు వస్త్రములు, వివిధ పూలతో ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శింపచేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.