- కారణం ఏదైనాచిన్నారులే లక్ష్యం
- మంట గలుస్తున్న మానవత్వం
- తిరుపతి వాసుల్లో ఆందోళన
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతోన్న తిరుపతి ఇప్పుడు హత్యా నేరాలకు నిలయంగా మారుతోంది. నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి గీతాలతో జనానికి భక్తి పారవశ్యం నింపాల్సిన నగరంలో నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించేవరకు రోజూ ఏదో ఒక మూలన హత్యలు, అరాచకాల విషయాలు వినబడుతున్నాయి. దీంతో తిరుపతి వాసులు ఆందోళన చెందుతున్నారు.
కారణం ఏదైనా...
గతంలో పాతకక్షల కారణంగా చిన్నారి గురుశీను... మొన్న అఘాయిత్యాన్ని చూశాడన్న నెపంతో చిన్నారి మురళీధర్‌రెడ్డిని మట్టుబెట్టారు. ఈ రెండు సంఘటనలను పరిశీలిస్తే కారణాలేవైనా మానవత్వం మంటగలిసేలా చిన్నారులను బలిగొన్నారు. ప్రతి విషయానికి పెద్దలు గొడవలు పడడం, ఆ తర్వాత చిన్నారులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌తో హత్య చేయడం తిరుపతిలాంటి ఆధ్యాత్మిక నగరంలో ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
తరచూ యువకుల హత్యలు
తిరుపతిలో ఇటీవల వరుసగా యువకుల హత్యలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం హిజ్రాలకు అడిగినంత డబ్బు ఇవ్వలేదని ఆర్టీసీ బస్టాండులో చిన్నచిన్న షాపులకు ఫైనాన్స్ ఇస్తూ జీవించే యువకుడిని ఆటోవాలాల సహకారంతో హత్యచేశారు. దానికి రెండు రోజుల ముందు తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి మార్గంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. రెండు నెలల క్రితం తిరుపతి రూరల్ మండలం దామినేడు సమీపంలో ఓ వ్యక్తిని తలపై కర్రతో బాది హత్య చేశారు. ఈ సంఘటనలను పూర్తిగా మరువక ముందే రెండు రోజుల క్రితం ఆటో అద్దె చెల్లించలేదన్న కారణంగా ఆటో యజమాని, అతని అనుచరులు కలసి ఆటో డ్రైవర్‌ను హత్య చేశారన్న సంఘటనపై బాధితుని తండ్రి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
‘ఎర్ర’దుండగుల బరితెగింపు
వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల చుట్టూ శేషాచల అడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో ఎర్రచందనం విస్తారంగా ఉంది. దీనిని కొల్లగొట్టేందుకు స్మగ్లర్లు, కూలీలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీరిలో ఎక్కువమంది తిరుపతి నుంచే శేషాచల అడవికి చేరుతున్నారు. ఇలా వెళ్లిన వారు నాలుగు నెలల క్రితం శేషాచల అడవిలో తిరుమలకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇద్దరు అటవీ అధికారులను హత్య చేశారు. తరచూ కూంబింగ్‌కు వెళ్లే పోలీసులపై ఎర్ర కూలీలు దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటివి నివారించాలంటే తిరుపతి ప్రజల సహకారం సైతం అవసరం.
నేరాలను కట్టడి చేయాలి
తిరుపతి నగరానికి రోజూ సుమారు 80వేల మంది యాత్రికులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. వారిలో ఎవరు యాత్రికులో, ఎవరు అఘాయిత్యాలకు పాల్పడేవారో తెలుసుకునే దిశగా పోలీసు నిఘా వ్యవస్థ ఉండాలని నగర వాసులు గట్టిగా కోరుతున్నారు. అలాగే ప్రజల్లో సైతం నేర ప్రవృత్తి తగ్గేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరిన్ని పెంచాలని పలువురు కోరుతున్నారు. ఈ దిశగా పోలీసు ఉన్నతాధికారులు, టీటీడీ కూడా దృష్టి సారించి ఆధ్యాత్మిక నగరంలో నేరాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.