
వీఆర్సీ సెంటర్‌లో జ్యూస్ దుకాణంలో నిల్వ ఉన్న పండ్లు
నిల్వ ఉంచి మురగబెట్టిన మాంసంతో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్ల బండారం బట్టబయలైంది. హోటల్లోని ఫ్రిజ్‌ల్లో గుట్టగుట్టలుగా మాంసాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఇప్పుడేమో కుళ్లిపోయిన పండ్లు, నిల్వ ఉంచిన పనికిరాని వాటితో జ్యూస్ చేసి ప్రజలతో కాలకూట విషాన్ని తాగించేస్తున్నారు. ఇది చూసిన అధికారులు నివ్వెరపోయారు. ‘మీ ఇంట్లో ఇటువంటివి తింటారా? తాగుతారా?’ అంటూ నిర్వాహకులను నిలదీశారు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, నెల్లూరు: కార్పొరేషన్ కమిషనర్ మూర్తి నేతృత్వంలో ఫుడ్ కంట్రోల్ అధికారులు, నగరపాలక సంస్థ హెల్త్ అధికారులు సోమవారం నెల్లూరు నగరంలో పలు జ్యూస్ షాపులు, హోటళ్లలో తనిఖీలు చేశారు. కుళ్లిపోయిన మామిడికాయలు, మందులు పెట్టి మాగపెట్టిన పండ్లు, నిల్వ ఉంచిన జ్యూస్‌లను అధికారులు గుర్తించి విస్తుపోయారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్సీ సెంటర్‌లోని లీలామమల్ పక్కనున్న సిమ్లా జ్యూస్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించి చెడిపోయిన పండ్లను కనుగొన్నారు. ఇటువంటివి వాటితో జ్యూస్ చేసి ప్రజలకు విక్రయించి వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం ఏమిటని కమిషనర్ మూర్తి నిర్వాహకులను నిలదీశారు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతారా అని ప్రశ్నించారు.
ఇలా మరోసారి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా నిల్వఉంచిన మాంసం, పండ్లు, జ్యూస్‌లు విక్రయాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ సిమ్లా జ్యూస్, వీఆర్సీ సెంటర్‌లోని వైఎస్సార్ జ్యూస్ షాపుల్లో తనిఖీలు చేయగా అనేక విషయాలు వెలుగు చూశాయన్నారు. కనీసం పరిశుభ్రత పాటించడం లేదన్నారు. ఇలాంటి చోట తయారైన ఆహార పదార్థాలు, జ్యూస్‌లు తీసుకోవడం ద్వారా తెలియని అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. మొత్తంగా 100 కేజీల చెడిపోయిన పండ్లు, 50 లీటర్ల జ్యూస్‌ను పారవేడయం జరిగిందన్నారు.
నిల్వ ఉంచిన మాంసం గుర్తింపు
కార్పొరేషన్ హెల్త్ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ వీఆర్సీ సెంటర్‌లోని మయూరి హోటల్‌లో తనిఖీలు చేయడంతో అక్కడ నిల్వ ఉంచిన మాంసం ఉందన్నారు. అలాగే పక్కనే ఉన్న వెంకటరమణ హోటల్‌లో కూడా తనిఖీలు చేశామన్నారు. తేదీ లేని వివిధ రకాల ఆహార పదార్థాలున్నట్లుగా గుర్తించామన్నారు. వీటితో పాటు వహాబ్‌పేటలోని మాంసం దుకాణాల్లో తనిఖీలు చేయగా 100 కేజీల నిల్వ ఉంచిన మాంసంను గుర్తించడం జరిగిందన్నారు. వీటిని స్వాధీనం చేసుకుని పారవేయడం జరిగిందన్నారు. మొత్తంగా ఒక్క రోజులో రూ.70 వేల ఫైన్ వేయడం జరిగిందన్నారు. నిత్యం ఈ దాడులు జరుగుతుంటాయన్నారు. ప్రజలకు అనారోగ్యం కలిగించే వాటిని విక్రయస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

వీఆర్సీ సెంటర్‌లో పండ్ల దుకాణాలను తనిఖీ చేస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment