
వైఎస్సార్ సీపీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి
హైదరాబాద్: కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సమక్ష్యంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనను జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరినట్టు ఎస్పీవై రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదింపజేసుకుంటానని చెప్పారు. అంతకుముందు జగన్తో ఎస్పీవై రెడ్డి సమావేశమయ్యారు. ఇరువురు నేతలు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. సమ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి.. జగన్ పార్టీలోకి రావడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయనుందని భావిస్తున్నారు.