సీదిలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ మాస్క్‌ల పంపిణీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పాతపట్నం మండలం కాగువాడలో తొలి మూడు కేసులు గుర్తించిన కుటుంబంలోనే మరో మహిళకు కరోనా సోకింది. ఆదివారం నమోదైన కేసుతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ట్రూనాట్ కిట్ పరీక్షలో ‘డిటెక్టెడ్ వెరీ లో’ అని వచ్చిన వృద్ధురాలికి రంగరాయ మెడికల్ కళాశాల వైరాలజీ ల్యాబ్‌లో పాజిటివ్‌గా నమోదైంది. ఈ పాజిటివ్ కేసులు వైద్య వర్గాలకు అంతుచిక్కడం లేదు. వీరిలో ఏ ఒక్కరికీ లక్షణాలు కన్పించడం లేదు. దానికితోడు ఢిల్లీ ప్రయాణ చరిత్ర ఉన్న వ్యక్తికి నెగిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి భార్యకు, 10 నెలల కుమారుడికి నెగిటివ్ వచ్చింది. కానీ అదే కుటుంబానికి చెందిన అతని అత్త, మామ, మరదలు, అత్త తల్లికి పాజిటివ్ వచ్చింది.
ఇప్పుడిదే వైద్యవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇవి అరుదైన కేసులుగా, వైద్య రంగానికే సవాల్‌గా పరిణమించాయని భావిస్తున్నారు. అసలు వ్యక్తికి రాకుండా ప్రైమరీ కాంటాక్ట్‌లకు పాజిటివ్ రావడంతో ఇంకే రకంగానైనా వైరస్ సోకిందా అనే దిశగా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాజిటివ్ కేసులొచ్చిన వారంతా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. వారికి ప్రత్యేకించి వైద్యం అందించడానికి ఏమీ కనబడని పరిస్థితి నెలకుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెంచేందుకు అవసరమైన మందులు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఊహకందని కేసులపై వైద్యులే కాదు అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అసలేమి జరిగి ఉండొచ్చని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి తెలియకుండానే సోకిన వైరస్ తగ్గిపోయిందా? ఈలోపే ఆయన నుంచి కుటుంబ సభ్యులకు సోకిందా? ఇంకే రకంగానైనా వచ్చిందా? ఇలా పలు కోణాల్లో వైద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి. (మా కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా)
కాంటాక్ట్స్ గుర్తించే పనిలో అధికారులు
ఒకే గ్రామంలో, ఒకే కుటుంబానికి చెందిన నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు కాంటాక్ట్స్ గుర్తించే పనిలో పడ్డారు. దాదాపు 96మందిని ఇప్పటికే క్వారంటైన్‌లో పెట్టినప్పటికీ ఇంకా ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రకరకాల ప్రచారం, గ్రామస్తుల నుంచి వస్తున్న అనుమానాలతో అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. అయి తే ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేయగా.. అతను సీది, కాగువాడ గ్రామాల్లో నే సంచరించినట్టు చూపిస్తున్నట్టు సమాచారం.(కరోనాను జయించి తిరిగి విధులకు హాజరైన ప్రధాని)
గ్రామస్తుల్లో టెన్షన్
క్వారంటైన్‌లో ఉన్న 96మంది విషయంలో కాగువాడ, పెద్దసీధి, మాకివలస తదితర గ్రామస్తుల్లో టెన్షన్ చోటు చేసుకుంది. వారిలో ఎవరికేమి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. వారంతా తమ తో తిరిగిన వారని, వారికేమైనా వస్తే తమ పరిస్థితేంటని భయపడుతున్నారు. ముఖ్యంగా ఒక ఆర్‌ఎంపీ డాక్టర్, ఒక నాయి బ్రాహ్మణుడు.. ఇలాంటి వ్యక్తులు కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. పాజిటివ్ కేసులొచ్చిన వారితో వీరంతా టచ్‌లో ఉన్నారు. వీరితో గ్రామస్తులంతా కలిసి మెలిసి తిరిగారు. అదృష్టవశాత్తు వారికి నెగిటివ్ వచ్చిందని, అయినప్పటికీ మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి అత్తకు పాజిటివ్ రావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు మరింత టెన్షన్ పడుతున్నారు. ఆమె సొంతంగా సాగు చేస్తున్న బెండకాయలు, ఇతరత్రా కూరగాయలను చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయించారు. ముఖ్యంగా కాగువాడ, కురసవాడ, తదితర ప్రాంతాల్లో విక్రయించడం వలన వాటిని కొనుగోలు చేసిన వారు కాసింత ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment