ఆంధ్రా ఆటగాళ్లు భారతజట్టుకు ఆడాలి: శ్రీనివాసన్
విశాఖపట్నం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వజ్రోత్సవాలు ఆదివారం విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ వజ్రోత్సవ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్, క్రికెటర్ అనీల్ కుంబ్లేలు హాజరయ్యారు. 2017లో ఏపీలో నేషనల్ గేమ్స్ నిర్వహించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
జాతీయ క్రీడల్ని నిర్వహించడం ద్వారా వచ్చే నిధులతో విశాఖలో స్పోర్ట్ కాంప్లెక్స్ నిర్మించుకోవచ్చని అచ్చెన్నాయుడు అన్నారు. క్రీడలను ప్రోత్సహించే విధంగా పాఠ్యపుస్తకాల్లో క్రీడా అంశాలను చేర్చాలని విద్యాశాఖను అచ్చెన్నాయుడు కోరారు.
దేశంలో అన్ని స్టేడియాలు మోడ్రనైజ్ అవుతున్నాయని, క్రీడాకారులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని అందరూ అందిపుచ్చికోవాలని ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్ ఈకార్యక్రమంలో తెలిపారు. ఆంధ్రా నుంచి ఆటగాళ్లు భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటున్నానని శ్రీనివాసన్ తెలిపారు.