
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం జలాశయం కృష్ణా యాజమాన్యబోర్డు పరిధిలోనే ఉందని ఏపీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణ సోమవారం తిరిగి ప్రారంభమై ంది. ఈ సందర్భంగా ఏపీ తరఫున హాజరైన సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో బోర్డు ఆదేశాలను ఏపీ పాటిస్తోందా? అని వైద్యనాథన్ ప్రశ్నించారు.
పాక్షికంగా రిజర్వాయర్‌ను ఏపీ నియంత్రిస్తున్నా నీటి వినియోగంపై బోర్డు ఆదేశాలనే పాటిస్తున్నామని సుబ్బారావు తెలిపారు. నీటి వినియోగానికి సంబంధించి ఉమ్మడి ఏపీలో ఆపరేషన్ మాన్యువల్ ఉండేదని, ఇప్పుడు రిజర్వాయర్ పరిధి బోర్డు నియంత్రణలో ఉందని చెప్పారు. బోర్డు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అధికంగా నీటిని వినియోగిస్తున్నామని చేస్తున్న ఆరోపణలు ఆమోదయోగ్యం కాదన్నారు. ముచ్చుమర్రి వద్ద 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో 12 పంపులు, 989 క్యూసెక్కుల సామర్థ్యంతో 4 పంపులు ఉన్నాయని సుబ్బారావు తెలిపారు.
మరి ఇన్ని పంపులు ఉంటే నీటిని తాగునీటి అవసరాలకు కాకుండా సాగునీటి అవసరాలకు వినియోగించుకొనే ఉద్దేశం కనిపిస్తోంది కదా? అని వైద్యనాథన్ పేర్కొనగా.. ముచ్చుమర్రి పథకం హంద్రీనీవా సుజల స్రవంతితో భాగమని సుబ్బారావు వివరించారు. కాగా, తమ తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాల కోసం కృష్ణా నది నుంచి 936.58 టీఎంసీల నీరు అవసరమని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ట్రిబ్యునల్‌లో అఫిడవిట్ దాఖలు చేసింది.