పంచాయతీ భవనం
బేస్తవారిపేట: పంచాయతీలకు ఇకపై గ్రేడింగ్ విధానం అమల్లోకి రానుంది. గ్రామాలు ఎంత మేరకు అభివృద్ధి సాధించాయో గుర్తించేందుకు నక్షత్రాల రూపంలో గ్రేడింగ్ ఇవ్వనున్నారు. గ్రేడింగ్ ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కానున్నాయి. క్షేత్ర స్థాయిలో ఆశించిన విధంగా అభివృద్ధి కనిపించడం లేదన్న కారణంతో నూతన విధానానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేపట్టే చర్యలపై ఈ రేటింగ్ విధానం ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.
అభివృద్ధి ఆధారంగా..
గ్రామ పంచాయతీల మధ్య ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 11 అంశాల్లో జరిగిన అభివృద్ధి ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తారు. 11 స్టార్లు సాధించిన గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా ప్రకటించి సముచిత రీతిలో ప్రభుత్వం గౌరవిస్తుంది. దశలవారీగా అన్ని గ్రామ పంచాయతీలకు మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబర్ 2 నాటికి ఆదర్శ గ్రామాలుగా తీర్చదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు.గ్రామ పంచాయతీలకు విడుదలైన 14వ ఆర్థిక సంఘం నిధులు పక్కదోవ పట్టించకుండ సక్రమంగా వినియోగిస్తే 11 అంశాల్లో ఎంతో కొంత అభివృద్ధి సాధించవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గతంలో పలువురు పంచాయతీ నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ, సర్పంచ్‌ల చేతివాటంతో పంచాయతీ జమాఖర్చులో తప్పుడు లెక్కలు నమోదు చేయడంతో నిధుల దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుని పూర్తిస్థాయిలో గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తే ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని పలువురు అంటున్నారు.
ఇవే 11 అంశాలు..
⇔ వంద శాతం మరుగుదొడ్లు వినియోగం జరగాలి
⇔ ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, వీధిదీపాలను ఎల్‌ఈడీలుగా మారాలి
⇔ ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి
⇔ గ్రామ ప్రజలందరికీ సురక్షిత తాగునీరు అందాలి. ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ ఉండాలి
⇔ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పెంపొందించేందుకు ఘన వ్యర్థాల నిర్వహన, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు చేయాలి.
⇔ ప్రయాణాలకు అనువైన రహదాలు, గ్రామంలో అంతర్గత సీసీరోడ్లు, శివారు గ్రామాలకు కలుపుతూ రోడ్ల నిర్మాణం జరగాలి.
⇔ గ్రామాన్ని కో–నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రతి ఇంటికి వెబ్‌సైట్.
⇔ ప్రతి పేద మహిళ పొదుపు సంఘంలో సభ్యులుగా ఉండేలా చూడడం, వారికి విభిన్న అంశాలపై నైపుణ్యాభివృద్ధితో శిక్షణ ఇచ్చి ఆదాయ వనరులను చూపడం
⇔ బడిఈడు పిల్లలంతా పాఠశాలకు హాజరవడం, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, ఫైబర్ నెట్ ఏర్పాటు
⇔ పిల్లలందరికీ 100 శాతం వ్యాధి నిరోధక టీకాలు, 100 శాతం ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు,100 శాతం పోషకాహార సేవలందజేయాలి
⇔ మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతకు కృషి, లింగ సమానత్వ సాధనకు మహిళలకు అన్నీ రంగాల్లో సమాన అవకాశాలు, గృహ హింస రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి.
Comments
Please login to add a commentAdd a comment