
విభజన బిల్లుపై సభలో పెదవి విప్పిన సీఎం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విభజన బిల్లుపై తొలిసారిగా చట్టసభలో మాట్లాడారు. గురువారం ఆయన శాసనమండలి సమావేశంలో బిల్లుపై పెదవి విప్పారు. విభజన సున్నితమైన సమస్య అని, ఎవరినీ నొప్పించకుండా చర్చ జరగాలన్నారు. సున్నితమైన సమస్యపై చర్చలో జాగ్రత్తగా మాట్లాడితే ఎలాంటి సమస్యలు రావని అన్నారు. వేరేచోట్ల విభజన ఎలా చేశారన్నది కూడా అందరూ అధ్యయనం చేయచాలన్నారు. అవసరం అయితే మళ్లీ బీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ బిల్లుపై చర్చ ఎలా జరగాలన్నది సభాపతులు స్పష్టం చేయలేదని సీఎం మండలిలో అన్నారు. నిబంధనలకు అనుగుణంగా చర్చ జరగాలని, చర్చపై సభ్యులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ అర్థం అయ్యేందుకే అన్ని విషయాలు చెబుతున్నానని సీఎం అన్నారు.
గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంప్రదాయాలను పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులపై ఎలా చర్చించాలో తెలుసుకోవాలన్నారు. ముందుగా విధానం చెప్పి అనంతరం చర్చ ప్రారంభించాలన్నారు.
అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. ఆయన ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపారు. సీఎం అప్పీల్లో స్పష్టత లేదని, సున్నితమైన అంశంపై చర్చ ఎప్పుడు, ఎంత సమయం జరుగుతుందో స్పష్టం ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు