సచివాలయాల్లో పారదర్శక పాలన | State government utilizing technical services for Implementation of welfare schemes | Sakshi

సచివాలయాల్లో పారదర్శక పాలన

Published Mon, Mar 9 2020 4:22 AM | Last Updated on Mon, Mar 9 2020 4:22 AM

State government utilizing technical services for Implementation of welfare schemes - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సంక్షేమ పథకాల అమలు, సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకతను తెస్తోంది. రాష్ట్రంలోని కుటుంబాలన్నింటినీ వలంటీర్ల క్లస్టర్లతో అనుసంధానం చేసే  ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాల్లో 50 కుటుంబాలకు ఒక వలంటీర్, పట్టణాల్లో అపార్ట్‌మెంట్లలో వంద కుటుంబాలకు ఒక వలంటీర్‌ చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 

ఇంటి వద్దకే పాలన..
- గ్రామ, వార్డు సచివాలయాలకు ఇప్పటికే స్మార్ట్‌ ఫోన్లు, 4జీ సిమ్‌లు, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్లు, డెస్క్‌టాప్స్, ప్రింటర్‌ కమ్‌ స్కానర్లను సరఫరా చేశారు.
- సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్లతోపాటు సంబంధిత శాఖలు, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం చేస్తున్నారు.
- అర్హులైన దరఖాస్తుదారుల వివరాలు కలెక్టర్, సంబంధిత శాఖ కార్యదర్శికి ఆన్‌లైన్‌లో అందుతాయి.
- కలెక్టర్‌/ సంబంధిత శాఖ కార్యదర్శి నిర్దిష్ట సమయంలోగా దరఖాస్తును పరిష్కరించి తిరిగి గ్రామ సచివాలయానికి పంపిస్తారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆ వివరాలను తెలియచేస్తారు.
- దీనివల్ల గ్రామంలోనే లేదా ఇంటి వద్దే ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతాయి. 
-  ఏ సేవలు ఎన్ని రోజుల్లో అందిస్తారనే వివరాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో  శాశ్వత బోర్డులను ఏర్పాటు చేశారు.  

యాప్‌లో దరఖాస్తు వివరాలు
- ఒక్కో వలంటీర్‌ను ఒక్కో క్లస్టర్‌గా పరిగణిస్తారు. వలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాల వివరాలను సేకరించి యాప్‌ ద్వారా అనుసంధానిస్తారు. 
ఆయా కుటుంబాల అవసరాలన్నీ వలంటీర్లే పర్యవేక్షిస్తారు. దరఖాస్తుదారులకు ప్రభుత్వం నుంచి ఏ సేవలు కావాలన్నా వలంటీర్లదే బాధ్యత. సచివాలయంలో సేవల కోసం చేసుకునే దరఖాస్తుల వివరాలు వలంటీర్‌ యాప్‌కు అందుతాయి.
- ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందినట్లు వలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రశీదు పొందాలి. యాప్‌లో వేలి ముద్ర ద్వారా దీన్ని ధృవీకరిస్తారు.
- 15,000 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 2.50 లక్షల వలంటీర్ల క్లస్టర్లలో కుటుంబాల అనుసంధానం చేపట్టారు. 1.37 కోట్ల కుటుంబాలకు  చెందిన 4.11 కోట్ల మంది ప్రజల అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోంది. 
కుటుంబాల్లో ఎవరినైనా చేర్చడం/తొలగింపు పనులను వలంటీర్లే నిర్వహిస్తారు. ఎవరైనా తమ నివాసాన్ని మరో ప్రాంతానికి మార్చుకున్నప్పుడు అనుసంధానం వల్ల తొలుత ఉన్న చోట నుంచి తొలగిస్తారు.
- అనుసంధానం ద్వారా అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, పెన్షన్లు, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ , బియ్యం కార్డులు తదితర పథకాల లబ్ధిదారులు ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement