సాక్షి, అమరావతి: అర్హులందరికీ తప్పనిసరిగా సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అందలేదని ఎవరైనా దరఖాస్తు చేస్తే.. దానిని ఆరు పాయింట్ల ఆధారంగా ధ్రువీకరణ చేయాలి. భూ రికార్డులు, విద్యుత్ బిల్లు, 4 చక్రాల వాహనం, ఆదాయ పన్ను, ప్రభుత్వ ఉద్యోగి, పట్టణాల్లో ఆస్తి డేటాను పరిశీలించి అర్హులా లేదా అనర్హులా అనేది తేల్చాలి. ఒకవేళ అనర్హులని తేలినా కూడా.. వారు మళ్లీ తమకు 4 చక్రాల వాహనం లేదని గానీ లేదా భూమి లేదని గానీ దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించాలి. దరఖాస్తుదారుడు చెప్పింది నిజమేనని తేలితే.. అతన్ని అర్హుడిగా ప్రకటించి 17 రోజుల వ్యవధిలో సంక్షేమ ఫలాలను మంజూరు చేయాలి. అలాగే డేటాలో కూడా రికార్డులను సవరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు..
► గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు స్పందన లేదంటే 1902కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే దాన్ని నమోదు చేయాలి.
► సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ఆ ఫిర్యాదును ఒక్క రోజులోనే.. సచివాలయంలోని సంబంధిత సంక్షేమ సహాయకుడికి పంపాలి.
► ఆ సహాయకుడు 3 పనిదినాల్లో క్షేత్రస్థాయి తనిఖీ చేసి.. నివేదికను గ్రామ, వార్డు కార్యదర్శికి అందజేయాలి.
► దానిని గ్రామ, వార్డు కార్యదర్శి మరోసారి పరిశీలించి నివేదికను మరో 3 పనిదినాల్లో ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్‌కు పంపాలి.
► వాటిని ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ పరీశీలించి.. 3 పనిదినాల్లో నివేదికను జిల్లా జేసీ(అభివృద్ధి విభాగం)కి అందజేయాలి.
► జాయింట్ కలెక్టర్ వాటిని పరిశీలించి.. 4 పనిదినాల్లో ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఆదేశాలివ్వాలి.
► ఆ ఆదేశాలు అందిన తర్వాత.. ఆ ఫిర్యాదుదారుడు అర్హుడని తేలితే 3 పనిదినాల్లో సంబంధిత శాఖ డేటాను సవరించి, అర్హుల జాబితాలో చేర్చాలి. ఈ ప్రక్రియ అంతా 17 రోజుల్లో పూర్తి చేయాలి.
► ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ర్యాండమ్‌గా 10 శాతం కేసులను, జేసీలు కనీసం ఒక శాతం కేసులను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి.
అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే..
డేటాలో తప్పులుంటే.. ఆ తప్పులను సరి చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అర్హులెవ్వరూ సంక్షేమ పథకాలు అందకుండా మిగిలిపోకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అనుగుణంగా ఆరు పాయింట్స్ ధ్రువీకరణను తీసుకువచ్చాం. క్షేత్రస్థాయి పరీశీలన చేసి.. అర్హులకు 17 రోజుల్లో సంక్షేమ పథకాలను మంజూరు చేస్తాం.
– అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment