సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తూ.. ప్రాధాన్యత పనులను గుర్తిస్తున్నారు. వాటిని మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది.
రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే 4,199 సచివాలయాలను ఎమ్మెల్యేలు, మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వాటి పరిధిలో 12,428 ప్రాధాన్యత పనులను గుర్తించగా, వాటి వివరాలను అప్‌లోడ్ కూడా చేశారు. ఇందులో 7,329 పనులను అధికారులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 1,044 పనులను ప్రారంభించారు.
అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 305 పనులు, తూర్పుగోదావరిలో 202, బాపట్లలో 200, శ్రీకాకుళంలో 157, కాకినాడ జిల్లాలో 152 పనులు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా పార్వతిపురం మన్యం జిల్లాలో 513 పనులు, ప్రకాశంలో 483, అనకాపల్లిలో 443, కాకినాడలో 440, పల్నాడులో 423, బాపట్ల జిల్లాలో 404 పనులు మంజూరు చేశారు. ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3,000.88 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
గుర్తించిన మరుసటి రోజే పనులు అప్‌లోడ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సచివాలయాలను సందర్శించిన మరుసటి రోజే ప్రాధాన్యతగా గుర్తించిన పనులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకున్నాం. వారంలోగా మంజూరు చేసి, నెలలోనే పనులు ప్రారంభించేలా చూస్తున్నాం. వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నూరు శాతం పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాధాన్యత పనులుగా గుర్తించిన వాటిలో మిగిలిన 5,099 పనులను ఈ నెల 5వ తేదీలోగా మంజూరు చేసి, ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం.
– అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment