
ఇక ‘ఖాకీ’ పప్పులుడకవ్.!
- స్టేషన్ బెయిల్ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం
- కేసు నమెదు చేసి కోర్టులో హాజరుపరచాల్సిందే
- అక్రమ ఆదాయానికి గండి
- పోలీసు అధికారులకు గుబులు
సాక్షి, విశాఖపట్నం: హత్య, అత్యాచారం వంటి తీవ్ర నేరాలు మినహా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే ఎలాంటి కేసులోనైనా పోలీస్ స్టేషన్‌లోనే నిందితులకు బెయిల్ మంజూరు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది. దీంతో ఇక మీదట స్టేషన్‌కు వచ్చే ప్రతి కేసును కచ్చితంగా న్యాయ స్థానానికి పంపించాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా, నగర పోలీసులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ ఈ అవకాశాన్ని అడ్డుపెట్టుకుని హాయిగా దోచుకుతిన్న వారు తమ అక్రమాదాయానికి గండి పడిందని తెగ బాధపడిపోతున్నారు.
నేరం రుజువైతే ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాల్లో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారాన్ని సిఆర్‌పీసీ సెక్షన్ 41-ఎ, దాని సబ్ క్లాజ్‌ల ప్రకారం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఐదేళ్ల క్రితం కట్టబెట్టారు. నేరం ఆరోపించిన వ్యక్తికి రాజ్యాంగ పరంగా ఉండే ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లకూడదనే ఉద్దేశంతో కల్పించిన ఈ సదుపాయం తర్వాత పోలీసు అధికారులకు కల్ప తరువుగా మారింది. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు నిందితుల నుంచి సొమ్ములు వసూలు చేయడం ప్రారంభించారు. సొమ్ము కోసం బాధితులను బెదిరించడం కూడా ప్రారంభించారు. నిందితులకు అండగా నిలబడి సెటిల్‌మెంట్లు చేయడం మొదలుపెట్టారనే విమర్ళలున్నాయి.
విశాఖలో ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఇద్దరు పోలీసు అధికారులు కొన్ని నెలల క్రితం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. శివారు ప్రాంతాల్లోని స్టేషన్లలో ఇప్పటికీ స్టేషన్ బెయిల్ పేరుతో బాధితులకు అన్యాయం చేసి నిందితుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా కేవలం ఒక్క రోజులోనే స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తుండటంతో నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా మాయం చేస్త్నున్నారు. అయితే ఇలాంటి సమస్యలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 41-ఎ లో సవరణలు చేసింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇక మీదట బెయిల్ ఇవ్వవద్దని చెప్పడంతో ఇప్పుడు కేసు నమోదు చేయకుండానే సెటిల్‌మెంట్లు చేసేస్తారోమో..!
సుప్రీం తీర్పుపై హర్షం
విశాఖ లీగల్: సుప్రీం కోర్టు పోలీసు అధికారులకు బెయిల్ మంజూరు చేసే అధికారాన్ని రద్దు చేయ డం పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం హర్షం ప్రకటించింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సు ప్రీం కోర్టు తీర్పు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 41 ఎ, బిపై మంగళవారం సుప్రీంకోర్టు ప్రకటించిన నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వేలాదిమంది జూనియర్ న్యాయవాదులకు మంచి అవకాశం లభించిందన్నారు. దీనివల్ల ప్రతి కక్షిదారుడు పోలీసులను ఆశ్రయించకుండా నేరుగా న్యాయస్థానంలో బెయిల్ పొందడం సులభమవుతుందన్నారు.