తీర్మానం ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకోండి: కె.తారకరామారావు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో నిబంధన 77 ప్రకారం చేసే తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికే పంపుతారని స్పష్టమైన నేపథ్యంలో.. సభలో జరిగిన తీర్మానాన్ని ఢిల్లీకి పంపకుండా ఉప ముఖ్యమంత్రి సహా టీ మంత్రులు అడ్డుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండ్ చేశారు. ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సీఎం కిరణ్ ఒత్తిడి తీసుకొచ్చినా... వారు ఆపే ప్రయత్నం చేయాలన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపినా.. తెలంగాణ ఏర్పాటులో ఫరక్ పడేది ఏమీ లేదు. కానీ, అనేక ఉల్లంఘనలతో అనైతికంగా చేసిన ఆ తీర్మానం ఢిల్లీకి వెళ్లకూడదన్నదే మా ప్రయత్నం’’ అని ఆయన చెప్పారు.
సభలో తీర్మానాన్ని ఆమోదించే విషయంలో స్పీకర్ మనోహర్ స్పష్టంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని కేటీఆర్ విమర్శించారు. స్పీకర్ తనపై సీఎం తెచ్చిన ఒత్తిడితో పాటు సొంత నియోజకవర్గం తెనాలిలో తన దిష్టిబొమ్మలు దహనం చేయడంతో ఒత్తిడికి లోనయి.. రాజ్యాంగబద్ధ పదవికే కళంకం తెచ్చారని మండిపడ్డారు. తనకు సభలో మాట్లాడే అవకాశమివ్వలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అంటున్నారని విలేకరులు ప్రస్తావించగా ‘‘చంద్రబాబు మాట్లాడలేదని టీటీడీపీ నేతలు సంబరపడుతున్నారు. బాబు మాట్లాడి ఉంటే ఆయన బండారం బయటపడి ఉండేది’’ అని పేర్కొన్నారు.
ఢిల్లీకి తరలివెళ్లిన కేసీఆర్, ఎమ్మెల్యేలు..
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహా పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఢిల్లీకి తరలివెళ్లారు. ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, హరీశ్వర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కె.విద్యాసాగరరావు, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, అలీ తదితరులు ఉదయం రైలులో ఢిల్లీ బయలుదేరి వెళ్లగా.. పార్టీ అధినేత కేసీఆర్‌తో కలిసి మరికొందరు ఎమ్మెల్యేలు రాత్రి విమానంలో వెళ్లారు. నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, నారదాసు లక్ష్మణరావు ఢిల్లీ వెళ్లారు.