మంత్రులమనే భావనే రావడం లేదు: కేటీఆర్
♦ మాకింకా ఉద్యమకారులమే అనిపిస్తోంది
♦ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు చేస్తున్నది కాకిగోలే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం సుదీర్ఘపోరాటం చేసి సాధించుకున్నం. మాకింకా ఉద్యమకారులమనే అనిపిస్తున్నది. మంత్రులుగా ఉన్నామనే భావన కూడా రావడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. వనపర్తి, కంటోన్మెంట్, పటాన్‌చెరు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు చెందిన నేతలు టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో గురువారం చేరారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె.తారక రామారావు, టి.పద్మారావు సమక్షంలో తెలంగాణ భవన్‌లో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి గురించి ప్రతిపక్షపార్టీల నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఏం చేసుకుంటారో చేసుకోవచ్చునని సమైక్య పాలకులు సవాల్ చేసిన అసెంబ్లీలోనే లక్ష కోట్ల బడ్జెట్‌ను పెట్టుకొని తొలి అడుగువేసినం. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చలేదని ప్రతిపక్షాలు కాకిగోల పెడుతున్నాయి’ అని అన్నారు. అర్హులందరికీ ఆహార భద్రతకార్డులు, పెన్షన్లు అందుతాయన్నారు. తాము దొంగలకు సద్దికట్టే రకం కాదని, అనర్హులకు ఒక్క పైసా కూడా చెందకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 8 నుంచి అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, టీడీపీల పునాదులుండవు: జగదీశ్
కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణలో పునాదులు కూడా లేకుండా పోతాయని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌లో గురువారం చేరగా, గులాబీ కండువాలను కప్పి వారిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై కక్ష సాధించేలా ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ నేతల మాటలకు, చేతలకు పొంతనలేదన్నారు.
అందుకే ఆ పార్టీల పునాదులు కదిలిపోయే విధంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, అభివృద్ధి, సంక్షేమం అన్నింటికీ ప్రాధాన్యత ఇచ్చిన తెలంగాణ బడ్జెట్‌ను చూసి ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయన్నారు. హామీలన్నీ నెరవేర్చి బంగారు తెలంగాణగా మారుస్తామన్నారు.