గులాబీ గూటిలో ఎమ్మెల్సీ వేడి!
- మార్చిలో 4, మేలో 3 శాసన మండలి స్థానాలు ఖాళీ
- టీచర్ ఎమ్మెల్సీకి పెరిగిన పోటీ
- సిట్టింగ్‌లకే తిరిగి అవకాశం!
- మార్చిలో ఖాళీ అయ్యే స్థానాలకు ఈ నెలలో నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగు నెలల్లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండడంతో అధికార టీఆర్‌ఎస్‌లో ఎన్నికల ముచ్చట్లు మొదలయ్యాయి. శాసన మండలిలో మార్చి 29న నాలుగు స్థానాలు, మేలో మరో 3 స్థానా లు ఖాళీ అవుతున్నాయి. దీంతో పలువురు ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు. పలువురు పార్టీ సీనియర్లు తమకో అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను అధినేత వద్దకు చేరేలా ప్రయత్నిస్తున్నారు.
తొలుత టీచర్, ఎమ్మెల్యే కోటాలు
‘మహబూబ్‌నగర్ – హైదరాబాద్ – రంగా రెడ్డి ’ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలో కోటాలో ఎన్నికైన సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వి (ఎంఐఎం), ఎం.రంగారెడ్డి (కాంగ్రెస్), వి.గంగాధర్‌గౌడ్ (టీఆర్‌ఎస్)ల పదవీకాలం మార్చి 29న ముగి సిపోతోంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎన్నికైన సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1న.. గవర్నర్ కోటాలో మండలికి నామినేటైన డి.రాజేశ్వర్ (టీఆర్‌ఎస్), ఫరూక్ హుస్సేన్ (టీఆర్‌ఎస్)ల పదవీకాలం మే 27న పూర్తవు తోంది. మొత్తంగా కేవలం 4 నెలల వ్యవధిలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుం డడంతో.. ఎవరి స్థాయి లో వారు ప్రయత్నా లు మొదలు పెట్టారని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చిలో గడువు ముగిసే స్థానాలకు ఫిబ్రవరి రెండో వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని పేర్కొంటున్నాయి.
టీచర్ ఎమ్మెల్సీకి పోటీ..
ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న కాటేపల్లి జనార్ధన్‌రెడ్డికి తిరిగి అవకాశం ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ స్థానానికి టీఆర్‌ఎస్‌లో కొంత పోటీ ఉన్నట్లు సమాచారం. జనార్దన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన పేరును అధినాయకత్వం ఖరారు చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నా.. టీఎస్ పీఆర్టీయూ నేత హర్షవర్ధన్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్ నుంచే టికెట్‌కు పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు అప్పజెప్పినట్లు సమాచారం. మొత్తంగా ఏడు స్థానాలకుగాను నలుగురికి తిరిగి అవకాశం దక్కనుంది. అయితే ఎమ్మెల్యే, గవర్నర్ కోటాల్లో ముగ్గురి ఎన్నిక తేలిక కాగా.. టీచర్ నియోజకవర్గం విషయంలో పోటీ ఎదుర్కొని గెలవాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌కు పరిస్థితి సానుకూలంగా ఉంది. మిగతా రెండు ఎమ్మెల్యే కోటాలోని స్థానాల విషయంలోనూ టీఆర్‌ఎస్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
వలస వచ్చిన వారికి అవకాశం!
మండలిలో టీఆర్‌ఎస్ గట్టెక్కేం దుకు, మండలి చైర్మన్ పీఠం చేజిక్కిం చుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్సీలను అధికార పార్టీలో చేర్చకున్నారు. తర్వాత మరికొందరు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా వలస వచ్చిన ఎమ్మెల్సీల్లో అత్య« దికులకు తిరిగి అవకాశమిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ నుంచి ఎన్నికై టీఆర్‌ఎస్‌లో విలీనమైన సభ్యుల్లో ఒకరైన వి.గంగాధర్‌గౌడ్... గవర్నర్ కోటాలో నామినేటై కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన డి.రాజేశ్వర్, ఫరూక్ హుస్సేన్‌లకు తిరిగి అవకాశం ఇవ్వనున్నారని ఆ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.