రాజుగారికి ఎందుకు చిర్రెత్తుకొచ్చిందంటే...
విజయనగరం జిల్లాలో రాజుగారుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పూసపాటి అశోకగజపతి రాజుగారు నరేంద్ర మోడీ కేబినెట్లో ఇటీవల మంత్రి పదవి చేపట్టారు. మొదటిసారిగా కేంద్రమంత్రి హోదాలో ఆయన సొంత జిల్లాకు విచ్చేశారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతారని అంతా భావించారు. కానీ కేంద్ర మంత్రి గారు వస్తుంటే రోడ్లపై ప్రజలు అంతగా కనిపించలేదు. సరికదా జిల్లాకు చెందిన అధికారులు కూడా కనీసం తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని సమాచారం.
అంతేకాకుండా మంత్రిగారు తన పర్యటనపై మందుగానే జిల్లా ఉన్నతాధికారులకు వెల్లడించినా.... సదరు అధికారులు ప్రోట్రోకాల్ పాటించడం లేదట. గత ఆదివారం ఉదయం విశాఖపట్నంలో ప్రొగ్రామ్ ఉందని ముందుగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఉన్నతాధికారులకు వెల్లడించారు. అయినా అధికారులు స్పందించలేదు. దాంతో ఆయనగారికి చిర్రెత్తికొచ్చింది. ఆగ్రహాన్ని ఆపుకోలేక తానే స్వయంగా డ్రైవ్ చేసుకుని సొంతవాహనంలో విశాఖపట్నం ప్రయాణమైయ్యారు.
ఆ విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీవో హుటాహుటిన మంత్రి గారి కారును చేజ్ చేసి... సార్ క్షమించాలి అంటూ కేంద్ర మంత్రిని ప్రాదేయపడ్డారట. ఆయన అశోక్కు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఇలాంటి సంఘటనలు పునారవృతమైతే సహించేదిలేదంటూ కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు క్లాస్ పీకారు.
1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అశోక్ గజపతి రాజు ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే 2004లో మాత్రం ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. మొదటిసారి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా మోడీ కేబినేట్లో పౌర విమానాయ శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు బాధ్యతులు చేపట్టారు.
అయితే గత ఏడాది అక్టోబర్లో సిరిమానోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా అశోక్గజపతి రాజు ఆ రోజు ఉదయం పైడితల్లి అమ్మవారిని దర్శించేందుకు దేవాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన్ని దేవాలయంలో ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో ఆమ్మ వారి ఆలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తన నిరసనను తెలిపారు. రాజుగారు రోడ్డుపై యాత్రలు చేయగలరు. అలాగే రోడ్డుపై ధర్నాలు చేయగలరు.