హొళగుంద, ఆలూరు/రూరల్, న్యూస్‌లైన్: దసరా పండగ వస్తుందంటే జిల్లా ప్రజలందరి చూపు దేవరగట్టుపైనే ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం ఇక్కడ జరిగే వేడుకలపైనే ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ ఏడాది నాటుసారా నియంత్రణ, కర్రల ఏరివేత, హెల్మెట్ల పంపిణీ.. ఇలా రక్షణ చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయినా ఇక్కడ సంప్రదాయానిదే పెమైట్టు అయింది. ఎన్నో ఏళ్లుగా వస్తున్న కర్రల సమరాన్ని భక్తులు కొనసాగించారు.
రాష్ట్ర నలుమూలల నుంచేకాక కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల కల్లా మాళమల్లేశర స్వామి ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి స్వామి కళ్యాణోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొలువుంచి కొండదిగువకు జయజయధ్వానాల మధ్య తీసుకొచ్చారు. నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట గ్రామాలకు చెందిన వేలమంది భక్తులు పల్లకోత్సవం వద్దకు చేరుకొన్నారు. ఉత్సవాలను సమైక్యంగా, వర్గ వైషమ్యాలకు అతీతంగా వైభవంగా నిర్వహించాలని పాల బాస తీసుకున్నారు.
ఈ తరుణంలో జైత్రయాత్ర ప్రారంభానికి సూచనగా కొందరు ఔట్లు పేల్చారు. కొందరు డిర్..గోపరక్..బహుపరాక్ అంటూ బిగ్గరగా నినదించారు. ఒక్కసారిగా వేలాదిమంది భక్తుల చేతిలో రింగులు తొడిగిన కర్రలు కరాళ నృత్యం చేశాయి. ఈ సందర్బంగా భక్తులు స్వామి బండారం (పసుపు)ను పెద్ద ఎత్తున వెదజల్లారు. వేలాది మంది భక్తులు తమ ఇలవేల్పుకు రక్షణ కల్పించే సంప్రదాయ క్రీడలో భాగంగా దివిటీలు, కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. మాళమల్లేశ్వరా బహుపరాక్ అంటూ అంటూ భక్తులు దిక్కులు పిక్కటిల్లేలా చేసిన నినాదాలు, కర్రల శబ్దాలు, అరుపులు, కేకలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది. భీకర యుద్ధాన్ని తలపించింది.
పోలీసులపై ఎదురు దాడి: జైత్ర యాత్ర ముందుకు సాగి పోయినా కొందరు అల్లరి మూకలు మల్లప్ప గుడి వద్ద దివిటీలను మహిళలపై విసిరారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు యత్నించారు. తిరగబడిన అల్లరి మూకలు కర్రలతో దాడికి దిగగా కొండపై ఉన్న మరి కొందరు రాళ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మూకల దాడికి తట్టుకోలేమని అంచనాకు వచ్చిన పోలీసులు వెంటనే కాళ్లకు పని చెప్పారు. దాడిలో 15 మందికి గాయాలు అయినట్లు సమాచారం. పెద్దకడుబూరులో పని చేస్తున్న కానిస్టేబుల్ మహమ్మద్ రఫీ చెవి కోసుకు పోగా కొందరికి కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులలో ఒక డీఎస్సీ ఉన్నట్లు సమాచారం. అయితే వివరాలు తెలిపేందుకు అధికారులు ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉండగా డాక్టరైన జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి స్వయంగా వైద్యుడి అవతారం ఎత్తి క్షతగాత్రులకు వైద్యం చేశారు.
క్షతగాత్రులకు వైద్య శిబిరంలో చికిత్స: గాయాలపాలైన భక్తులకు వైద్య శిబిరంలో చికిత్స చేశారు. వైద్యులు షమీఉల్లా, తాహెర్‌భాష, చంద్రశేఖర్, మహమ్మద్‌తో సిబ్బంది క్షత గాత్రులకు వైద్య సాయం అందించిన వారిలో ఉన్నారు. తీవ్ర గాయాలకు గురి అయిన వారిని మరింత ఉన్నత చికిత్స కోసం ఆలూరు, ఆదోని, కర్నూలు, బళ్లారికి తరలించారు.
రక్త సంతర్పణ : ఆలయానికి దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రక్ష పడిలో జరిగిన రక్త సంతర్పణ కార్యక్రమం భక్తులను తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. పల్లకోత్సవం రక్ష పడికి చేరుకోగానే అక్కడ ఉన్న మల్లప్ప తాత తన ఎడమ కాలు పిక్కల్లో డబ్బణం గుచ్చి, నులకను లాగి పిడికెడు రక్తంను మణి ,మల్లాసురులకు సంతర్పణ చేశారు. భక్తులను ఇష్టారాజ్యంగా సంహరించుకుండా రాక్షసుల కోరిక మేరకు ఐదు చుక్కల రక్తాన్ని భక్తుల తరఫున తాను ఐదు చుక్కలు రక్తాన్ని సంతర్పణ చేశానని మల్లప్పతాత తెలిపారు.
జమ్మి పత్రితో శుభాకాంక్షలు తెలుపుకున్న భక్తులు: మాత మాళమ్మ, మల్వేశ్వరి స్వామి పల్లకోత్సవం శమీ(జమ్మి చెట్టు) వృక్షం వద్దకు చేరుకోగానే కర్రల సమరం మరోసారి నిలిచి పోయింది. శమీ వృక్షానికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పరస్పరం జమ్మి పత్రి ఇచ్చుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
‘భవిష్యవాణి ’కి ప్రత్యేకత : బన్ని ఉత్సవాలలో భవిష్యవాణికి ప్రత్యేకత ఉంది. భక్తులు భవిష్యవాణి ఆధారంగానే పంటలు సాగు చేస్తారు. జైత్ర యాత్ర బసవన్న కట్టకు చేరుకోగానే ఆలయ ప్రధాన అర్చకుడు మల్లయ్య స్వామి బసవన్న గుడి పై ఎక్కి డిర్.్ర..ర్.్ర.గోపరక్..బహుపరక్ అనగానే భక్తులు ఒక్క సారిగా కర్రల సమరంను నిలిపి వేసి నిశ్బబ్దం పాటించారు. పంటలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పిన మల్లయ్య స్వామి ధరలు మాత్రం కొంత నిరాసపరుస్తాయని పేర్కొన్నారు.
పత్తి ధర క్వింటాలు రూ.3 500, జొన్న రూ.2100 ఉండొచ్చని అర్థం వచ్చేలా 6-3, 3-6 అనగా వాణిజ్య పంటల ధరలు నిలకడగా ఉండవని చెప్పారు. దేవేంద్రుడు దేవ లోకం నుంచి వజ్రాయుధంతో దిగి భూలోకంలో తిరుగుతున్నాడని, శివ గంగి మానస సరోవరంలో పర్యటిస్తోందని పేర్కొన్న స్వామి వరదలు వచ్చే సూచనలు చేశారు.
భారీ బందోబస్తు: ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్లు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రఘురామిరెడ్ది నేతృత్వంలో ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 89 మంది ఎస్‌ఐలు, 950 మంది బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులు సిబ్బందికి అవసరం అయిన సలహాలు, సూచనలు చేశారు. దేవరగట్టు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో పోలీసులు కర్రలను స్వాధీనం చేసుకుని ఆలూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే జైత్ర యాత్ర ప్రారంభం కాగానే వేలాది మంది చేతిలో ఇనుప రింగులు తొడిగిన కర్రలు ప్రత్యక్షం కావడం గమనార్హం.
జైత్రయాత్ర.. సంప్రదాయ పాత్ర
Published Wed, Oct 16 2013 3:05 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement