ఐదేళ్ల క్రితం నిర్భయ దృష్టాంతం ఇంకా జనం మనోఫలకం నుంచి తొలగిపోలేదు. రెండు రోజుల క్రితం ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌రేప్ సంఘటన ఇంకా దేశాన్ని కుదిపేస్తోంది. ఇంతలోనే మరో ఘటన. అదెక్కడో కాదు. మన జిల్లాలోనే. సరిగ్గా నడవలేని దివ్యాంగురాలని కూడా చూడకుండా... ఇద్దరు ప్రబుద్ధులు మద్యం మత్తులో కూరుకుపోయి... కామంతో కళ్లు మూసుకుపోయి... దారుణంగా లైంగికదాడి చేసిన సంఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని ఓ దివ్యాంగురాలిపై ఇద్దరు కామాంధులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. నిజానికి జిల్లాలో ఇలాంటి సంఘటనలు కొత్త కాదు. ఏటా ఎన్నో జరుగుతున్నా... వెలుగులోకి రానివెన్నో. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అమాయక మహిళలపై అఘాయిత్యాలుసర్వసాధారణమైనప్పటికీ ఏ ఒక్కటీ పోలీస్ స్టేషన్ వరకూ రాదు. స్థానిక పెద్దలే పంచాయతీ చేసి, ఆమె శీలానికి వెలకట్టేస్తుంటారు. పోలీస్ రికార్డుల ప్రకారం జిల్లాలో గతేడాది మూడు, 2016లో ఐదు లైంగిక దాడి ఘటనలు జరిగాయి.
జిల్లా వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాలు 2016లో 33 నమోదైతే గతేడాది 46, ఈ ఏడాది ఇప్పటి వరకూ 6 కేసులు రికార్డయ్యాయి. ఈ పరిస్థితులపై ప్రజా, మహిళా సంఘాలు, వైద్యులు, న్యాయ నిపుణులు మండి పడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నా... చట్టాల్లో మార్పులు, ప్రజల్లో చైతన్యం రావాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయని మేధావులు నినదిస్తున్నారు.
నిర్భయ చట్టాన్ని అమలు చేయాలి
మానవత్వం మరణించిన వేళ చిన్నపిల్లలను, దివ్యాంగులను కూడా విడవని దుర్మార్గులు ఉన్న ఈ ప్రపంచంలో ఏడు సంవత్సరాల బాలికలకైనా... 70ఏళ్ల అవ్వకైనా రక్షణ లేదు. స్వచ్చభారత్ అన్న మోదీగారు ఆడవాళ్ల ఆత్మగౌరవం కోసం ఏం చేస్తున్నారు. ఆడవాళ్లకోసం ఇచ్చిన చట్టాలు ఏమయ్యా యి. తప్పుడు భావంతో అమ్మాయిని చూడాలంటే మృగాళ్లు భయపడేలాంటి చట్టం మాకు కావాలి. నిర్భయ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి.
– తుమ్మి లక్ష్మీరాజ్, మహిళా సమాఖ్య జిల్లా సహాయకార్యదర్శి, విజయనగరం.
పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యమే కారణం
పోలీస్ వ్యవస్థ బాగుంటే అంతా బాగుం టుంది. ముఖ్యంగా శాఖాపరమైన నిర్లక్ష్యం వల్లే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు మహిళా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. అభం, శుభం తెలియని అమాయకుల జీవితాలను నాశనం చేసే కామాం ధుల్ని ఉరితీయాలి. రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గడం వల్ల నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
– పాలూరి రమణమ్మ, ఐద్వా జిల్లా సహాయకార్యదర్శి, విజయనగరం
ఎన్నో కారణాలు... మరెన్నో బాధలు
తల్లిలేదా తండ్రి లేని వారు, ఉన్నప్పటికీ వారి ప్రేమ, భయం, పర్యవేక్షణ లేనివారు ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. సెల్‌ఫోన్లలో ఆశ్లీల దృశ్యాలను ఎక్కువగా చూసేవారు తాము అలా చేయాలని కోరుకుంటారు. స్నేహితుల ప్రభావం కూడా ఉంటుంది. ఇక గ్యాంగ్‌రేప్‌కు గురైన యువతులు భయభ్రాంతులకు లోనవుతారు. ఒక్కోసారి తల్లిదండ్రులను కూడ దగ్గరకు రానివ్వరు. అలాంటి వారికి వెంటనే వైద్యం అందించాలి. రెండు రోజుల పాటు వారి దగ్గరకు ఎవరూ వెళ్లకూడదు. సహాయకులుగా ఒక్కరే ఉండాలి. అదీ మహిళలై ఉండాలి. రెండు మూడు రోజులు తర్వాత సైకాలజిస్టు తో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
–ఎస్.వి.రమణ, సైకాలజిస్టు, విజయనగరం
చట్టాల పటిష్టంగా అమలైతే చాలు
మహిళల రక్షణ దిశగా రూపొందించిన చట్టాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించాలి. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. నిర్థిష్ట సమయంలో విచారణ చేపడితేనే ఇలాంటి దారుణాలు తగ్గుతాయి. మహిళల రక్షణ కోసం గృహ హింస నిరోధకచట్టం, దీనినే నిర్భయ చట్టంగా పిలుస్తున్న ఫోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రం సెక్సవల్ అఫైన్‌సెస్) చట్టం రూపొందించారు. విచారణకు ప్రత్యేక కోర్టులు లేకపోవడం వల్ల కేసుల్లో జాప్యం జరుగుతోంది.
-కె.ఆర్.దాశరధి, సీనియర్ న్యాయవాది, విజయనగరం.
Comments
Please login to add a commentAdd a comment