ఆగ్రహ జ్వాల | strike peaceful | Sakshi
Sakshi News home page

ఆగ్రహ జ్వాల

Sep 3 2015 1:09 AM | Updated on Sep 3 2017 8:37 AM

ఆగ్రహ జ్వాల

ఆగ్రహ జ్వాల

తమ కుటుంబాలకు అన్నం పెడుతున్న భూములను సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలకు ....

మచిలీపట్నం : తమ కుటుంబాలకు అన్నం పెడుతున్న భూములను సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తే ప్రాణాలైనా వదులుకుంటాం గాని భూములు వదులుకునే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. బందరు పోర్టు, అనుబంధ పారిశ్రామిక అభివృద్ధి కోసం జిల్లా అధికారులు ఇటీవల పత్రికా ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో బందరు మండలంలో ఆయా గ్రామాల రైతులు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఏకతాటిపైకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. బందరు పోర్టు నిర్మాణం కోసం 5,324 ఎకరాల భూమిని సేకరిస్తామని ఇంతకాలంగా చెబుతూ వచ్చిన పాలకులు, అధికారులు పోర్టు, అనుబంధ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏకంగా 30 వేల ఎకరాలను సేకరించేందుకు భూసేకరణ నోటిపికేషన్‌ను జారీ చేయడంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కనీస సమాచారం లేకుండా, రైతులతో ఎలాంటి సంప్రదింపులూ జరపకుండా తమకు జీవనాధారంగా ఉన్న భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

నోటిఫికేషన్ జారీపై ఆందోళన
బందరు పోర్టు కోసం మంగినపూడి, తపశిపూడి, కరగ్రహారం, చిలకలపూడి, బందరు వెస్ట్ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూమిని సేకరిస్తామని ప్రకటించి హఠాత్తుగా 19 గ్రామాల్లోని 30 వేల ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బుధవారం కోన, కరగ్రహారం, పోతేపల్లి, గోకవరం గ్రామాల్లో రైతులు పార్టీలకతీతంగా సమావేశాలు నిర్వహించారు. భూమిని వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రైవేటు భూములను సర్వే చేసేందుకు అధికారులు గ్రామాలకు వస్తే వారిని ఇక్కడే నిర్బంధిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని కోన గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు పెరుమాళ్లు నాగేంద్రం, గంజాల శ్రీరాములు, కోమటి వెంకటేశ్వరరావు తదితరులు అన్నారు. కోన గ్రామ పరిధిలోని భూములతో పాటు గ్రామంలో నివాస భూమిని సైతం స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారని వారు మండిపడ్డారు. కోన గ్రామంలో 2,072 ఎకరాల భూమిని సేకరిస్తే గ్రామంలోని రైతులకు ఒక్క ఎకరం కూడా మిగలదని, వీరంతా ఎలా బతుకుతారని ప్రశ్నించారు.

పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం
బందరు మండలంలోని పొట్లపాలెం, పోతిరెడ్డిపాలెం, పోతేపల్లి గ్రామాలకు చెందిన రైతులు, పలువురు మహిళలు పోతేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. పురుగుమందు డబ్బాలు సహా తరలివచ్చిన వీరు ప్రభుత్వం భూములు తీసుకుంటే తామంతా ఆత్మహత్యలు చేసుకుంటామని, ప్రభుత్వం తమ ఉసురు కట్టుకోవద్దని నినాదాలు చేశారు. అనంతరం పోతేపల్లి హైస్కూల్ ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకలపూడి పీఏసీఎస్ అధ్యక్షుడు గాజుల నాగరాజు, పోతేపల్లి ఎంపీటీసీ పిప్పళ్ల నాగబాబు, మాజీ సర్పంచ్ కాటం మధుసూదనరావు, శ్రీపతి చంద్రం, పోసిన బాబూరావు తదితరులు పాల్గొన్నారు. పోతిరెడ్డిపాలెం సర్పంచ్ మేకా లవకుమార్ తదితరులు మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతుల భూములను బడా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం సాహసిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గ్రామాల్లో సర్వే పనులను ముందుకు సాగనివ్వబోమని హెచ్చరించారు. కరగ్రహారం పంచాయతీ కార్యాలయం వద్ద రైతులు సమావేశం నిర్వహించి భూమి సర్వే పనులను జరగనివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. గోకవరం సంతబజారు వద్ద గోకవరం, చిరివెళ్లపాలెం తదితర గ్రామాల రైతులు సమావేశమై భూసేకరణ అంశాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఐకమత్యంగా ఉండండి : పేర్ని నాని
భూసేకరణకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల్లో రైతులు సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కోన, గోకవరం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందరు పోర్టు నిర్మాణానికి ఐదారు గ్రామాల్లో ఐదువేల ఎకరాల భూములు తీసుకోవడానికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలకు 19 గ్రామాల పరిధిలోని 30 వేల ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేయటం దారుణమన్నారు. రైతులకు జీవనాధారంగా ఉన్న భూమిని ప్రభుత్వం అకారణంగా గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

పార్టీలకతీతంగా జెండాలను పక్కనపెట్టి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, రైతులంతా ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. రైతులు చేసే ప్రతి ఉద్యమానికి తాను మద్దతు తెలుపుతానని హామీ ఇచ్చారు. 19 గ్రామాల్లో సర్వే చేసేందుకు ఒకటి, రెండు రోజుల్లో అధికారులు వచ్చే అవకాశం ఉందని, ఒక్క గ్రామంలో కూడా సర్వే పనులు జరగకుండా రైతులంతా ఐకమత్యంగా అడ్డుకోవాలని సూచించారు. అప్పుడే ప్రభుత్వానికి రైతుల మనోభావాల తీవ్రత అర్థమవుతుందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement