వెంకటాచలం: వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ డిగ్రీ విద్యార్థినిని బలితీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... తాడిపత్రిపాలెం అర్జునవాడకు చెందిన దివ్య వెంకటాచలంలోని చైతన్యభారతి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళాశాలలో పరీక్ష రాసేందుకు బుధవారం ఉదయం తన తండ్రి సూరయ్యతో కలసి ద్విచక్రవాహనంపై వెంకటాచలం వైపు వెళుతూ రోడ్డును దాటబోయారు.
ఆ సమయంలో కృష్ణపట్నం పోర్టువైపు వెళుతున్న టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దివ్య అక్కడికక్కడే మృతి చెందగా... స్వల్పంగా గాయపడిన సూరయ్యను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనతో తాడిపత్రిపాలెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టు వాహనాలు అతి వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దివ్య మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.